రేట్ల కోతతో ఆర్థిక వ్యవస్థకు ఊతం: జైట్లీ
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తే దేశీ ఎకానమీకి ఊతమిచ్చినట్లవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. వడ్డీ రేట్ల తగ్గుదల వల్ల పెట్టుబడుల కోసం చౌకగా రుణాలు లభించగలవని ఆయన తెలిపారు. మరిన్ని పెట్టుబడులు వస్తే ఎకానమీ మరింతగా మెరుగుపడగలదన్నారు. సిటీ సంస్థ నిర్వహించిన ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రొఫెషనల్ సంస్థగా ఆర్‌బీఐ సముచిత నిర్ణయం తీసుకోగలదని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే ఉద్దేశంతో ఆర్‌బీఐ పాలసీ రేట్లను జనవరి నుంచి 8 శాతం స్థాయిలోనే కొనసాగిస్తోంది. తాజాగా సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.52 శాతానికి, టోకుధరల ఆధారిత సూచీ 1.77 శాతం రికార్డు స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతోనే వచ్చే నెల 2న జరిగే పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు, శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో బీమా సవరణ బిల్లు ఆమోదం పొందగలదని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ) అమల్లోకి తెచ్చేందుకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నామని, ఇప్పటికే చాలా మటుకు వివాదాస్పద అంశాలు పరిష్కారమయ్యాయని ఆయన చెప్పారు.
అన్నీ పరిశీలించాకే నిర్ణయం: ఆర్‌బీఐ
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే పరపతి విధాన సమీక్షలో పాలసీ రేట్లపై నిర్ణయం తీసుకునేటప్పుడు ద్రవ్యోల్బణ తగ్గుదల తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని ఆర్‌బీఐ డిప్యుటీ గవర్నర్ ఎస్ ఎస్ ముంద్రా చెప్పారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన ఆర్‌బీఐ స్టాల్‌ను సోమవారం ప్రారంభించిన సందర్భంగా ముంద్రా ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగితే, భౌగోళిక..రాజకీయ అనిశ్చితి తలెత్తితే దేశీయంగా ద్రవ్యోల్బణం మళ్లీ ఎగిసే అవకాశం ఉందన్నారు.
ఫిబ్రవరిలో చాన్స్!: గోల్డ్‌మన్ శాక్స్
న్యూఢిల్లీ: ఆర్‌బీఐవచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో వడ్డీ రేట్లను కుదించవచ్చునని గోల్డ్‌మన్ శాక్స్ తాజాగా అంచనా వేసింది. ఫిబ్రవరిలో 0.25%, ఏప్రిల్‌లో మళ్లీ మరో 0.25% చొప్పున రేట్లలో కోత పెట్టే అవకాశముందని పేర్కొంది. తద్వారా రెపో రేటును 8% నుంచి 7.5%కు తగ్గించవచ్చునని అభిప్రాయపడింది. 2015 ప్రథమార్ధంలో వడ్డీ రేట్లలో కోతకు చాన్స్ లేదంటూ ఇంతక్రితం వేసిన అంచనాను పక్కనపెట్టినట్లు రీసెర్చ్ నివేదికలో గ్లోబల్ బ్రోకరేజీ దిగ్గజ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ ఈ సందర్భంగా తెలిపింది.