సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2014ను పార్లమెంట్ ఆమోదించి నాలుగేళ్లు గడుస్తోంది. విభజన చట్టంలోని హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. రాజధాని లేకుండా ఏర్పడిన నూతన రాష్ట్రానికి కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తాయని ఎంతగానో ఆశించింది. అయితే, నాలుగేళ్లుగా నిరాశే మిగులుతోంది. ప్రతి బడ్జెట్‌కు ముందు నిధులు వస్తాయని లెక్కలేసుకోవడం, చివరకు ఉసూరుమనడం పరిపాటిగా మారింది.
ఈ నాలుగేళ్లలో ఇప్పటిదాకా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీల్లో కొన్ని నెరవేరినా వాటికి పూర్తిస్థాయి నిధుల కేటాయింపులు జరగలేదు. ఎన్డీయే ప్రభుత్వం గురువారం తన చివరి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌లోనైనా న్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశగా ఎదురుచూస్తోంది.
అన్యాయం జరుగుతున్నా నోరు విప్పరేం?
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు. ప్యాకేజీ కింద ఇప్పటిదాకా పైసా కూడా రాబట్టలేకపోయారు. నాలుగేళ్లుగా కేంద్రం హామీలను అమలు చేయకపోయినా, నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నా చంద్రబాబు గట్టిగా నిలదీసిన దాఖలాలు లేవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్‌లో రాజధాని నిర్మాణం, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో ఇప్పటి వరకు పైసా కూడా విడుదల కాలేదు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి కేవలం రూ.970 కోట్లు వచ్చాయి. ఇప్పటిదాకా చేసిన పనులకు గాను ఇంకా రూ.3,217 కోట్లు రావాల్సి ఉంది. రెవెన్యూ లోటు కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,100 కోట్లు రావాల్సి ఉండగా, పైసా కూడా ఇవ్వలేదు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పలు విద్య, వైద్య సంస్థలను కేంద్రం మంజూరు చేసినప్పటికీ వాటికయ్యే వ్యయాన్ని బడ్జెట్‌లో కేటాయించడం లేదు.
పరిష్కారం దొరకని అంశాలు
- ఏపీకి 2014–15కు సంబంధించిన రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వలేదు.
- రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇప్పటివరకు రూ.2,500 కోట్లు కేటాయించింది. అయితే, రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది? ఎంత సాయం కావాలన్న దానిపై రాష్ట్ర సర్కారు నుంచి సరైన ప్రతిపాదనలు రాలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
- పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు విషయంలో దోబూచులాట కొనసాగుతోంది. పునరావాస ప్యాకేజీపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రావాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. నాబార్డు ద్వారా నిధులు ఇస్తామని హామీలు ఇస్తున్నా.. ఇప్పటిదాకా ఇచ్చింది నామమాత్రమే.
- పన్ను రాయితీలు, ప్రోత్సాహకాల పరిధిని పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌పై గత నాలుగు బడ్జెట్లలోనూ స్పష్టత ఇవ్వలేదు.
- దుగరాజపట్నం పోర్టు, కడపలో స్టీల్ ప్లాంట్, విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు వంటి చట్టబద్ధమైన హామీలను సైతం నాలుగు బడ్జెట్లలో కేంద్రం విస్మరించింది.
- విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైళ్ల ఏర్పాటుకు నిర్ధిష్టమైన కేటాయింపులు జరపలేదు. వీటి ఏర్పాటుపై సందిగ్ధత వీడలేదు.
- విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయడంలో ఆశించిన పురోగతి లేదు.
- వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని కోరాపుట్–బొలాంగిర్–కలహండి(కేబీకే) ప్రత్యేక ప్రణాళిక తరహాలో, బుందేల్‌ఖండ్ స్పెషల్ ప్యాకేజీ తరహాలో ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో ప్రకటించారు. కానీ, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రం ఏటా రూ.50 కోట్ల చొప్పున మాత్రమే విడుదల చేస్తోంది.
- జాతీయ విద్యా సంస్థలైన ఐఐటీ, ఐఐఎం, ఎన్‌ఐటీ, ఐఐఎస్‌ఈఆర్, కేంద్రీయ వర్సిటీ, పెట్రోలియం వర్సిటీ, వ్యవసాయ వర్సిటీ, ఐఐఐటీ తదితర సంస్థలను కేంద్రమే నిర్మించాల్సి ఉంది. వీటికి నామమాత్రంగానే నిధులు కేటాయిస్తోంది.
విశాఖ రైల్వే జోన్‌పై ఏపీ సర్కారు అనాసక్తి
విశాఖపట్నం రైల్వే జోన్.. 50 ఏళ్లనాటి డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఈ హామీని చేర్చారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో కలిసి విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. రాష్ట్ర విభజన జరిగి దాదాపు నాలుగేళ్లవుతున్నా ఈ హామీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రైల్వే జోన్ ఆవశ్యకతను ఏనాడూ కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదు. ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాలుగేళ్లుగా పోరాడుతోంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఏపీలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎప్పుడూ కోరలేదని దక్షిణ మధ్య రైల్వే జోనల్ బోర్డు సభ్యుడు జాన్‌బాబు చెప్పడం గమనార్హం. రైల్వే జోన్‌పై రాష్ట్ర సర్కారుకు ఏమాత్రం ఆసక్తి లేదని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే కేంద్రం కూడా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment