* ఇ గవర్నెన్స్, పేపర్‌లెస్ పాలన అంటున్న ప్రభుత్వం
* రూ.200 కోట్లు వెచ్చించడానికి సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రెండువందల కోట్ల రూపాయలకు పైగా వ్యయాన్ని వెచ్చిస్తూ ఏకంగా లక్ష కు పైగా ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఒకవైపు లోటు బడ్జెట్, నిధుల లేమి అని ముఖ్యమంత్రి తరచూ బీద అరుపులు అరుస్తుంటారు.
అయితే పాలనపరమైన సౌకర్యం కోసం అంటూ ఇప్పుడు ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వెచ్చించడానికి సిద్ధం అవుతుండటమే ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కీలక ఉద్యోగులందరికీ ఈ ట్యాబ్‌లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇక నుంచి గ్రామ, మండల స్థాయి నుంచి ఏ అధికారి అయినా స్మార్ట్ ఫోన్ల ద్వారా టెలిగ్రామ్, వాట్స్‌యాప్ సౌకర్యాలతో ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి సమాచారం తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు.
అలాగే రాష్ట్రస్థాయి నుంచి క్షేత్ర స్థాయి అధికారులకు ఏ సమాచారం పంపాలన్నా మెయిల్ ద్వారానే పంపించనున్నారు. ఇ-గవర్నెన్స్‌లో భాగంగా ట్యాబ్‌లను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఉన్నతస్థాయి అధికారి తెలిపారు. ఒక్కో ట్యాబ్‌కు పది వేల రూపాయల వ్యయం, ఒక్కో స్మార్ట్ ఫోనుకు పది వేల రూపాయల వ్యయం అవుతుందని ఐటీ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మొత్తంగా రెండువందల కోట్ల రూపాయలు వెచ్చించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
స్కూళ్లకు 62 వేల ట్యాబ్‌లు
దశల వారీగా రాష్ట్రంలోని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్‌కు కూడా ట్యాబ్‌లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్కూల్స్ అన్నీ కలసి 62 వేలకు పైగా ఉన్నాయి. అంటే మరో 62 వేల ట్యాబ్‌లను కొనుగోలు చేసి పంపిణీ చేయనున్నారు.
లక్షకు పైగా ట్యాబ్‌ల కొనుగోలు
Published Sun, Jul 19 2015 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM
Advertisement
Advertisement