కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు
నాడు తొలి విడతలోనే ప్రకటన
ప్రతిపాదనలు పంపిన భూపరిపాలనశాఖ..?
అందుకే పోలీస్ కమిషనరేట్‌కు శంకుస్థాపన
'తూర్పు' ప్రజల్లో చిగురించిన ఆశలు
సాక్షి, మంచిర్యాల :
మంచిర్యాల.. ఇక త్వరలోనే కొత్త జిల్లాగా అవతరించనుంది. పరిపాలనా సౌలభ్యం.. ప్రజల ఆకాంక్ష మేరకు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు... లేదా 15 లక్షల జనాభాకో జిల్లా ఉండేలా పునర్వవ్యస్థీకరిస్తామని ఎన్నికల మెనిఫెస్టోలో పేర్కొన్న తెలంగాణ సర్కార్ ఆ మేరకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లోనే తొలి విడతగా రాష్ట్రంలో వికారాబాద్, జగిత్యాల, సిద్దిపేట, సూర్యాపేట, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, మంచిర్యాల(కొమురంభీం) కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా.. కామారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్‌లో రెండు మొత్తం 11 జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని గత సెప్టెంబర్‌లోనే భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అధికారులూ కసరత్తు చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలు.. ప్రవేశపెట్టిన పథకాలు విజయవంతం కావాలన్నా.. పాలనా సౌల భ్యం ఉండాలన్నా కొత్త జిల్లాల ఏర్పాటు ఎంతో అవసరమని తాజాగా.. సీనియర్ ఐఏఎస్ అధికారులూ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా వెనకబడిన ప్రాంతం కావడం.. భౌగోళికంగా పెద్దగా ఉండడం.. ప్రత్యేకంగా తూర్పు, పశ్చిమ ప్రాంతాలుండడం.. ఇక్కడి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న మండలాలు ఒక దానికొకటి దూరంగా విసిరేసినట్టుగా ఉండడంతో కొత్త జిల్లా ఏర్పాటు అనివార్యమైంది. దీంతో ప్రజల వద్దకు వెళ్లేందుకు శాసనసభ్యులకూ తీరిక లభించని పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఇప్పటికీ అనేక మండలాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. అభివృద్ధి ఫలాలూ అర్హుల దరి చేరడం లేదు. ఈ నేపథ్యంలో మంచిర్యాలను కొమురంభీంగా నామకరణం చేసి కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తానని టీఆర్‌ఎస్ మెనిఫెస్టోలోనూ పేర్కొంది. సీఎం కేసీఆర్ సైతం పలు దఫాలుగా ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలోనే కొత్త రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో మంచిర్యాల(కొమురంభీం)ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా పరిసర ప్రాంతాలన్నీ కలిపి ప్రభుత్వం ఇటీవల మంచిర్యాల పరిధిలోని నస్పూర్‌లో పోలీస్ కమిషనరేట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడమూ జిల్లా ఏర్పాటులో భాగమేనని జిల్లాకు చెందిన ఓ అధికారి చెప్పారు. అయితే.. మంచిర్యాలను కాకుండా బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాలంటూ ఇప్పటికే ఎన్నో ఆందోళనలు.. నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం మంచిర్యాలనే జిల్లాగా ఏర్పాటు చేయాలనే పట్టుతో ఉంది.
కొత్త అసెంబ్లీ నియోజకవర్గాల ఏర్పాటెన్నడూ..?
మంచిర్యాల జిల్లాగా రూపు దిద్దుకుంటే తూర్పు ప్రాంతంలో అసెంబ్లీ నియోజకవర్గాల రూపురేఖలూ మారనున్నాయి. ఇప్పటి వరకు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతున్న మందమర్రి పట్టణం, రూరల్, బెల్లంపల్లి సెగ్మెంట్ పరిధిలో ఉన్న కాసిపేట మండలాన్ని కలిపి కొత్తగా మందమర్రి అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పాటు చేయాలని గత ఐదేళ్ల క్రితమే ప్రతిపాదనలు తయారయ్యాయి. చెన్నూరు మండల కేంద్రం నుంచి మందమర్రి దూరంగా ఉండడంతో ఈ మార్పు అనివార్యమని గత ఎంపీలూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఇదే క్రమంలో బెల్లంపల్లి సెగ్మెంట్ పరిధిలో ఉన్న వేమనపల్లి మండలం ఆ నియోజకవర్గ కేంద్రం నుంచి దూరంగా ఉండడం.. చెన్నూరుకు సమీపంలో ఉండడంతో వేమనపల్లిని చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్లో కలపాలనే ప్రతిపాదనా ఉంది. బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో ఇప్పటి వరకు ఆరు మండలాలున్నాయి. వాటిలో కాసిపేట మండలం మందమర్రి నియోజకవర్గంలో, వేమనపల్లి మండలం చెన్నూరు నియోజకవర్గంలో కలిపే ప్రతిపాదనలుండడంతో.. బెల్లంపల్లి సెగ్మెంట్ తాండూరు, బెల్లంపల్లి అర్బన్, రూరల్, నెన్నెల, భీమిని మండలాలతోనే పరిమితం కానుంది.
ఇప్పటికే ఏడు మండలాలున్న ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని ఐదు మండలాలకు పరిమితం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వాంకిడి, తిర్మాణి, రెబ్బెన, కెరమెరి, ఆసిఫాబాద్‌తో నియోజకవర్గం కుదించాలనే ప్రతిపాదనలు తయారైనట్లు సమాచారం. అసెంబ్లీ నియోజకవర్గాల పున ర్విభజన 2026 తర్వాతే సాధ్యమని ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరీభాయ్ చౌధురీ ఇది వరకే స్పష్టం చేశారు. నియోజకవర్గాల ఏర్పాటు ప్రక్రియ జిల్లా ఏర్పాటు ప్రక్రియకు ఏదైన అడ్డంకులు సృష్టిస్తుందా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
మంచిర్యాల జిల్లా..మరోసారి తెరపైకి
Published Thu, Jul 9 2015 6:59 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
Advertisement