నదీ జలాల వినియోగానికే ప్రాజెక్టుల రీ డిజైన్
- కాళేశ్వరం వద్ద ప్రాజెక్టుతో 180 టీఎంసీలు అందుబాటులోకి..
- 'ప్రాణహిత'కు జాతీయహోదాపై కేంద్రం వివక్ష
- రోడ్లు,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భద్రాచలం నుంచి సాక్షి బృందం :
గోదావరి జలాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తోందని రోడ్లు,భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గత పాలకుల హయూంలో తెలంగాణ ప్రజలకు నిధుల కేటాయింపు, నీటి వినియోగం, నియామకాల విషయంలో జరి గిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు పేర్కొన్నారు. మంత్రి శనివారం ఆర్డీవో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం వద్ద నిర్మించే ప్రాజెక్టుతో 180 టీఎంసీల గోదావరి నీరు వినియోగంలోకి వస్తుందన్నారు.
ఈవిషయంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలోని ఏడు జిల్లాలలో 16 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించడంలో కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి(ఢిల్లీ)వేణుగోపాలాచారి మాట్లాడుతూ ఉత్పత్తి ప్రాజెక్టుల పేరుతో హడావుడిగా కాలువల తవ్వకం చేపట్టి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేశారని అభిప్రాయపడ్డారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు తదితరులున్నారు.