ఊపిరి చినుకులు
- పంట చేలకు ఊరటనిచ్చిన తాజా వానలు
- పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. వాడిపోతున్న పంటలకు ప్రాణం
- చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
- రెండ్రోజుల తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం
- గోదావరి నదికి భారీగా వరద నీరు
- ఖమ్మం జిల్లాలో పొంగుతున్నవాగులు, వంకలు
- అయినా రాష్ట్రంలో నేటికీ లోటు వర్షపాతమే
- ఈ వానలు 15 రోజుల ముందు కురిసి ఉంటే చాలా పంటలు దక్కేవంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఒక మోస్తరు.. ఆ తర్వాత రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో ఖమ్మం జిల్లా పాల్వంచలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లా వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరంతా గోదావరిలో కలుస్తుండడంతో నది ఉధృతి పెరుగుతోంది. వాజేడు మండలంలోని చీకుపల్లి వాగు పొంగుతుండడంతో రెండ్రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల చెరువులు కళకళలాడుతున్నాయి. మొత్తమ్మీద ప్రస్తుత వర్షాలు.. వర్షాభావంతో వాడిపోతున్న పంటలకు ప్రాణాలు పోశాయి. గత 24 గంటల్లో గోవిందారావుపేట, భద్రాచలంలో 7 సెంటీమీటర్లు, కొత్తగూడెంలో 6, నవాబ్‌పేటలో 5, మహబూబాబాద్, ధర్మపురిలో 4, సరూర్‌నగర్, ములుగు, అశ్వారావుపేట, బయ్యారం, కూనవరం, జూలూరుపాడు, ముల్కలపల్లి, గోల్కొండ, సంగారెడ్డి, టేకులపల్లి, బాన్స్‌వాడలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
అయినా 22 శాతం లోటు..
వర్షాలు కురుస్తున్నప్పటికీ గత నెల ప్రభావం నుంచి రాష్ట్రం ఇంకా కోలుకోలేదు. జూలైలో వర్షాలు అసలే లేకపోవడంతో ఆ లోటును ప్రస్తుతం కురుస్తున్న వానలు పూడ్చలేకపోతున్నాయి. ఆదివారం నాటికి రాష్ట్రంలో ఇంకా 22 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఖమ్మం, వరంగల్ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. మెదక్ జిల్లాలో అత్యధికంగా 58%, మహబూబ్‌నగర్‌లో 51%, నిజామాబాద్, హైదరాబాద్‌లో 47 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైంది. వచ్చేనెలలో వర్షాలు పూర్తిస్థాయిలో ఉంటేగానీ లోటు తగ్గదని అధికారులు అంటున్నారు.
కాస్త ముందు కురిసి ఉంటే..
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు 15 రోజుల క్రితం పడి ఉంటే రాష్ట్రంలోని అన్ని పంటలకు ప్రయోజనం కలిగి ఉండేదని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో పంటలు పూర్తి స్థాయిలో చేతికి అందడం కష్టమేనని అంటున్నారు. మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పంటల ఎదుగుదల ఉండదని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఫలితంగా పంటల దిగుబడి తగ్గుతుందని స్పష్టం చేస్తోంది. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో మాత్రమే పంటల పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
మహబూబ్‌నగర్ జిల్లాలోని సుమారు 3 లక్షల ఎకరాల్లోని పత్తి, మొక్కజొన్న ఎండిపోయిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆ పంటలకు ఈ వర్షాలతో ప్రయోజనం ఉండదని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంటల దిగుబడి సగానికి తగ్గుతుందని సర్కారు కూడా అంచనాకు వచ్చింది. అయితే ఈ వర్షాలు ముందస్తు రబీ పంటలకు ప్రయోజకరంగా ఉంటాయని వ్యవసాయ శాఖ డిప్యూటీ డెరైక్టర్ కె.రాములు పేర్కొన్నారు. నారుమడి ఉంటే వరి నాట్లు వేసుకోవచ్చని ఆయన సూచించారు.
ఉరకలేస్తున్న గోదావరి
భద్రాచలం టౌన్: భద్రాచలం వద్ద గోదావరి ఉరకలేస్తోంది. శనివారం రాత్రి 29 అడుగులు ఉన్న నీటిమట్టం ఆదివారం సాయంత్రం 36.3 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాలలో వర్షాలు కురుస్తుండటంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఆ అవకాశం లేనప్పటికీ ముందు జాగ్రత్తగా కిందిస్థారుు సిబ్బందిని అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది.