► మధ్యంతర ఉత్తర్వులిచ్చిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బాలల హక్కుల కమిషన్ సభ్యుల నియామకాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన చైర్మన్ నియామకంపై గతంలో స్టే ఇచ్చిన హైకోర్టు.. తాజాగా కమిషన్ సభ్యులుగా ఆరుగురిని నియమించిన తీరును తప్పుపడుతూ స్టే ఉత్తర్వులిచ్చింది. నారా నాగేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల ఈ ఆదేశాలు జారీ చేశారు.
జీవో 3 ప్రకారం సంబంధిత శాఖ మంత్రి చైర్మన్‌గా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించే జడ్జి, అసెంబ్లీ స్పీకర్ సిఫార్సు చేసే ఎమ్మెల్యే సభ్యులుగా ఉండే కమిటీ... కమిషన్ సభ్యుల్ని ఎంపిక చేయాలని, అందుకోసం నిర్వహించిన ఇంటర్వ్యూకు మంత్రి తుమ్మల హాజరు కాలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చాపరాల శ్రీరామ్ ధర్మాసనానికి విన్నవించారు. బాలల హక్కుల చట్టం–2005కు విరుద్ధంగా నియామకం జరిగిందని, బాలల హక్కులకు చెందిన వివిధ రంగాల్లో సేవలు చేసిన అనుభవం ఉండాలనే చట్ట నిబంధనను పాటించలేదన్నారు.