జైపూర్: నీళ్ల కుండను తాకాడని ఓ దళిత చిన్నారిని టీచర్ దండించడం.. ఆ దెబ్బలకు ఆ చిన్నారి మరణించడం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో, మీడియాలో విస్తృతంగా చర్చ కూడా నడిచింది. అయితే..
ఈ ఘటనపై శుక్రవారం షాకింగ్ రిపోర్ట్‌ను సమర్పించింది రాజస్థాన్ చైల్డ్ ప్యానెల్. అసలు ఈ వ్యవహారంలో దళిత కోణం ప్రస్తావనే లేదని తేల్చేసింది. జలోర్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తొమ్మిదేళ్ల బాలుడిని.. భోజన సమయంలో మంచి నీళ్ల కుండ తాకాడంటూ అగ్రకులానికి చెందిన ఒక టీచర్ తీవ్రంగా కొట్టాడని, ఆ దెబ్బలకు ఆ చిన్నారి మరణించాడని, దళితుడు కావడంతోనే అతనిపై అలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడన్నది ఆ ఘటనపై మీడియాలో వచ్చిన కథనం.
అయితే.. డ్రాయింగ్ బుక్ విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఈ విషయం తనదాకా రావడంతో.. ఆ ఇద్దరు విద్యార్థులను టీచర్ విపరీతంగా కొట్టాడు. అందులో ఒక చిన్నారే బాధితుడు. కంటికి, చెవికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆ తొమ్మిదేళ చిన్నారికి చికిత్స అందించారు. ఆ సమయంలోనే మృతి చెందాడు. ఇదీ.. రాజస్థాన్ బాలల హక్కుల సంఘం.. రాజస్థాన్ ప్రభుత్వానికి, విద్యాశాఖకు ఇచ్చిన నివేదిక సారాంశం.
ఈ మేరకు స్కూల్‌ను సందర్శించిన చైల్డ్ ప్యానెల్ సభ్యులు.. బాధిత చిన్నారి తోటి విద్యార్థులను, టీచర్లను ఆరా తీసినట్లు తెలుస్తోంది. అంతేకాదు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, జిల్లా పరిపాలనాధికారి అందించిన వివరాల ప్రకారం ఆ స్కూల్‌లో కుండనే లేదని, తాగు నీటి కోసం ఓ ట్యాంకర్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.
బాధితుడి సోదరుల వాదన
అయితే బాధితుడి సోదరులు ఇద్దరూ నరేష్ కుమార్, నాపారాంలు అదే స్కూల్‌లో చదువుతున్నారు. వాళ్లు మాత్రం తమ తమ్ముడు మధ్యాహ్న భోజన సమయంలో మంచి నీటి కుండ నుంచి నీళ్లు తీసుకున్నందుకే టీచర్ చితకబాదాడంటూ చెప్తున్నారు. వీళ్ల స్టేట్‌మెంట్‌నూ కూడా నివేదికలో జత చేసింది చైల్డ్ ప్యానెల్. అంతేకాదు.. ఒకవేళ స్కూల్ అనుమతుల్ని విద్యాశాఖ గనుక రద్దు చేస్తే పిల్లలను మరో స్కూల్‌లో అడ్మిషన్లకు అనుమతించాలంటూ సూచించింది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో అధికార కాంగ్రెస్ పార్టీని తీరును విమర్శిస్తూ.. దళిత సంఘాలు ధర్నాలు, నిరసనలు చేపడుతున్నాయి. బీజేపీ సైతం ఈ ఘటనను ఆధారంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది.
ఇదీ చదవండి: చిన్నారి మృతి కేసు.. అధికార కాంగ్రెస్‌లో ముసలం
Comments
Please login to add a commentAdd a comment