మూగబోయిన మధుర స్వరం | Telugu Playback Singer V Ramakrishna Dies at 68 | Sakshi
Sakshi News home page

మూగబోయిన మధుర స్వరం

Published Fri, Jul 17 2015 3:19 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

మూగబోయిన మధుర స్వరం

మూగబోయిన మధుర స్వరం

* మూగబోయిన మధుర స్వరం
* ప్రముఖ గాయకుడు రామకృష్ణ కన్నుమూత

హైదరాబాద్  : ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు విస్సంరాజు రామకృష్ణ(68) కన్నుమూశారు. కొంత కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న రామకృష్ణ జూబ్లీహిల్స్ వెంకటగిరిలోని తన నివాసంలో గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విస్సంరాజు రంగశాయి-రత్నం దంపతులకు 1947 ఆగస్టు 20న విజయనగరంలో రామకృష్ణ జన్మించారు.

ప్రఖ్యాత సినీ నేపథ్యగాయని సుశీల.. రామకృష్ణకు పినతల్లి. ఆయన నేదునూరి కృష్ణమూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతంలో మెలకువలు నేర్చుకున్నారు. అలనాటి అగ్రహీరోలందరికీ గాత్రం అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. భక్తి గీతాల ఆలాపనలో తనదైన ముద్రవేసి శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన విశిష్ట గాయకుడు ఆయన. సుమారు 200 చిత్రాల్లో అయిదువేలకు పైగా పాటలను  పాడారు.  

రామకృష్ణ మృతితో సంగీత ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఆయన పార్థివ దేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, నటుడు తనికెళ్ల భరణి, ఎస్‌పీ.శైలజ, సునీత తదితర గాయకులు, దర్శకులు విచ్చేసి రామకృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన అంత్యక్రియలు పంజగుట్ట హిందూ శ్మశాన వాటికలో జరిగాయి.  రామకృష్ణ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తపరిచారు.

పార్క్‌హయత్ హోటల్‌లో జరిగిన సంతాప సభకు  రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి, నటీమణులు జమున, జయసుధ, జయప్రద, జీవిత రాజశేఖర్, నటుడు సుమన్, దర్శకుడు కోదండరామిరెడ్డి,సురేష్‌బాబు తదితరులు హాజరై సంతాపం వ్యక్తంచేశారు. కొద్దిసేపు పాటు మౌనం పాటించి నివాళులర్పించారు.
 
రామకృష్ణ మృతి పట్ల కేసీఆర్ సంతాపం
ప్రముఖ గాయకుడు విస్సంరాజు రామకృష్ణ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దాదాపు 200 చిత్రాల్లో 5 వేలకు పైగా పాటలు ఆలపిం చిన రామకృష్ణ.. తన మధుర గానంతో ఎంతో మంది అభిమానులను సంపాదించారని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సినీ, భక్తిరస గీతాలే కాకుండా తెలంగాణ ఉద్యమ పాటలు కూడా ఆలపించిన రామకృష్ణ.. రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారని సీఎం కొనియాడారు. రామకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 
ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అలనాటి ప్రముఖ గాయకుడు విస్సంరాజు రామకృష్ణ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సినిమాలు, ప్రైవేటు ఆల్బమ్‌లలో 5 వేలకు పైగా పాటలు పాడిన రామకృష్ణ మృతి చలనచిత్ర రంగానికే కాకుండా యావత్ సంగీత ప్రపంచానికే తీరని లోటుగా పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
 
వైఎస్ జగన్ సంతాపం
ప్రముఖ సినీ గాయకుడు వి.రామకృష్ణ మృతికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. సినిమా పాటల ఆలాపనలో ఆయన ఎన్నో మైలురాళ్లు అధిగమించారని, ఆయన లేని లోటు పూడ్చ లేనిదని జగన్ పేర్కొన్నారు. రామకృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement