సాక్షి, హైదరాబాద్: కథానాయకుడిగా, సహాయ నటుడిగా, హాస్యనటుడిగా, కొన్ని చిత్రాల్లో ప్రతినాయకుడిగానూ నటించిన ‘ఆల్ రౌండర్’ చంద్రమోహన్ (82) ఇక లేరు. కొన్నాళ్లుగా ఆయన గుండె, కిడ్నీ సంబంధిత, మధుమేహం వ్యాధులతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికాగా.. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 9.45కు చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు.
తర్వాత ఆయన భౌతికకాయాన్నిఫిలింనగర్‌లోని స్వగృహానికి తీసుకెళ్లారు. అక్కడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు చంద్రమోహన్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. చంద్రమోహన్‌కు భార్య జలంధర, కుమార్తెలు మధుర మీనాక్షి, మాధవి ఉన్నారు. జలంధర ప్రముఖ రచయిత్రికాగా.. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరపడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అమెరికాలో ఉన్న మధుర మీనాక్షి వచ్చాక సోమవారం మధ్యాహ్నం చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన మేనల్లుడు, ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు.
‘రంగుల రాట్నం’తో మొదలై..
ఏపీలోని కృష్ణా జిల్లా పమిడిముక్కలలో మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు 1942 మే 23న జన్మించారు చంద్రమోహన్. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రఖ్యాత దర్శకుడు కె.విశ్వనాథ్ తమకు దగ్గరి బంధువు కావడంతో.. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో చెన్నై వెళ్లారు. బీఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘రంగుల రాట్నం’(1966) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. హీరోగా సుమారు 175కుపైగా సినిమాలు చేశారు. మొత్తంగా తన 55 ఏళ్ల సినీ కెరీర్‌లో కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటుడిగా ఇలా దాదాపు 900కుపైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. తనదైన నటనతో ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. పలు తమిళ సినిమాల్లోనూ నటించారు.
విభిన్న పాత్రలతో.. ఎన్నో అవార్డులతో..
‘సుఖదుఃఖాలు, కాలం మారింది, ఓ సీత కథ, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి, పదహారేళ్ల వయసు, శంకరా భరణం’ వంటి క్లాసిక్ చిత్రాల్లో మెప్పించారు చంద్రమోహన్. ‘గంగ మంగ’, ‘లక్ష్మణ రేఖ’వంటి చిత్రాల్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు. శ్రీకాంత్ హీరోగా నటించిన ‘కోతలరాయుడు’ (2022) తెలుగులో చంద్రమోహన్ చివరి చిత్రం. తొలిచిత్రం ‘రంగుల రాట్నం’కు నంది అవార్డు అందుకున్నారు. 1987లో ‘చందమామ రావే’ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో ‘అతనొక్కడే’ చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు, సిరిసిరిమువ్వ’ సినిమాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment