ఉల్లి లొల్లి
- రైతుబజార్లలో క్యూ
- పల్లెవాసులకేదీ?
ఉల్లి కోసం జనం బారులు తీరుతున్నారు. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో మాత్రమే కిలో రూ.20 చొప్పున పంపిణీ చేస్తున్నారు. తమ పరిస్థితి ఏమిటంటూ గ్రామీణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కరీంనగర్(ముకరంపుర): ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటారు.. కానీ సీన్ రివర్సయ్యింది. ప్రస్తుతం ఉల్లి అంతటా లొల్లి చేస్తోంది. వర్షాభావం.. దిగుబడి.. దిగుమతులు లేక ఉల్లి కొరత నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీపై విక్రయించాలని నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.50 పలుకుతున్న ఉల్లిని మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో రూ.20కే అందిస్తోంది. ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోని 6 రైతుబజార్లలో విక్రయిస్తోంది. కరీంనగర్‌లోని రెండు రైతుబజార్లు, సిరిసిల్ల, జగిత్యా ల, పెద్దపల్లి, మంథనిలోని ఒక్కో రైతుబజార్ కేంద్రంలో ప్రత్యేక విక్రయాలు చేస్తున్నారు.
కుటుంబానికి 2 కిలోలే పంపిణీ చేస్తామని, ఏదేని గుర్తింపు కార్డు తప్పనిసరి అని నిబంధన విధించారు. దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి కొనుగోలు చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చుని అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కేంద్రాల్లో ప్రజల తాకిడి ఒకేలా ఉంటోంది. అక్కడక్కడా క్యూలైన్‌లో గొడవలు కూడా ముదురుతున్నాయి. మరోవైపు ఏదేని గుర్తింపు కార్డు తేవాలని చెప్పడంతో ప్రజలంతా ఆధార్‌కార్డుతో కొనుగోలు చేస్తుండడంతో మార్కెటింగ్‌శాఖ అధికారులు తల లు పట్టుకుంటున్నారు. ఆహారభద్రత కార్డు కుటుంబానికి ఒక్కటే ఉంటుంది. కానీ, ఆధార్‌కార్డు కుటుంబంలో ముగ్గురి నుంచి ఐదుగురు సభ్యుల వరకు ఉండే అవకాశముంది. ఒకే కుటుం బసభ్యులంతా వేర్వేరుగా ఉల్లిగడ్డలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే పరిస్థితి ఎదురైంది. జిల్లాకు ఇప్పటికే 26 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డలు వచ్చాయి. మరో 26 మెట్రిక్ టన్నుల కోసం ప్రతిపాదనలు పంపారు. నిరుపేదలుండే పల్లెలను వదిలి పట్టణవాసులకు మాత్రమే సబ్సిడీపై ఉల్లిని అందుబాటులో ఉంచడంపై గ్రామీణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లెల్లో ప్రజలు కిలో నాణ్యతను బట్టి కిలో రూ.50 నుంచి రూ.55కు కొనుగోలు చేస్తున్నారు. రెండు కిలోల ఉల్లిగడ్డల కిలోల కోసం తాము డివిజన్ కేంద్రాలకు వెళ్లాలా అని ప్రశ్నిస్తున్నారు. తమ కు కూడా పల్లెల్లో సబ్సిడీపై ఉల్లిగడ్డ అందించాలని కోరుతున్నారు. పాత సామగ్రికి ఉల్లిగడ్డలిచ్చే వ్యాపారులు సైతం ఇప్పుడు ఆలుగడ్డలు ఇస్తుండడం గమనార్హం.