ప్రత్యూషను...ఆదుకునేదెవరు...?
♦ ఒంటిపై పలు గాయాలు, శరీరంలో లోపల పుండ్లు
♦ సవతి తల్లి ఘాతుకానికి బలైన యువతి దైన్యం
♦ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ప్రజా సంఘాల విస్మయం
సాక్షి, హైదరాబాద్ : సవతితల్లి వేధింపులతో తీవ్ర గాయాల పాలైన ప్రత్యూష(16) ఆరోగ్య పరిస్థితి చూసి వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సాగర్ హైవేలోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష శరీరంపై అంగుళం కూడా ఖాళీ లేకుండా గాయాలు, వాతలు, శరీరం లోపల పుండ్లు అయినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం రీనల్ ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్న ప్రత్యూష మొహంపైనే యాసిడ్‌తో దాడిచేసిన మచ్చ, గొంతులో యాసిడ్ వల్ల ఏర్పడిన గాయాలు, శరీరంపై చెప్పలేని ప్రాంతాల్లో సహా అన్ని భాగాల్లో సిగరెట్లతో కాల్చిన వాతలు, తలను గోడకు మోదడంతో ఏర్పడినవి, ఆమె దయనీయతను తెలియజేస్తున్నాయి.
‘యాసిడ్, హర్పిక్ వంటివి తాగించడం వల్ల నాలుక కమిలిపోయింది. మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. కండరాలు వాచిపోయాయి. రక్తహీనతతో బాధపడుతోంది. ఎప్పటికప్పుడు రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉంది. ఛాతీలో నీరు ఉండటం వల్ల ఆయాసం వస్తోంది. కుడి భుజం వద్ద కొట్టిన దెబ్బలతో రక్తం గడ్డకట్టుకుపోయింది. చెవుల నుంచి నిరంతరాయంగా చీము వస్తుంది’ అని ప్రత్యూషకు చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు.
కోలుకోవాలంటే నెలరోజులు
ప్రత్యూష మళ్లీ మామూలుగా కావాలంటే దాదాపు నెల రోజులు సమయం పట్టే అవకాశం కనబడుతోంది. అప్పటివరకు ఆమెకు ప్రత్యేక వైద్యం అవసరమని డాక్టర్లు అంటున్నారు. ఆ తర్వాత ఆమెకు మరో నెలరోజుల పాటు మానసిక చికిత్స చేయాలి. ఇక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక ఎక్కడికెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. తల్లి చనిపోయింది. చిత్రహింసలు పెట్టిన మారుతల్లి చాముండేశ్వరి రిమాండులో ఉంది. తండ్రి రమేష్ పరారయ్యాడు. ఇలా ఎవరూలేని ప్రత్యూషకు మరో ఆరు నెలల పాటు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది. అటు నా అన్నవాళ్లు ఎవరూ లేకపోవడంతో పాటు వైద్యానికి అవసరమయ్యే ఖర్చులు ఆమెకు ఎలా అన్నది ప్రశ్నార్థకం కానుంది. ఇప్పటివరకు బాలల హక్కుల సంఘం అండగా నిలబడింది. ఇకపై ఎలా అన్నదే అందర్నీ వేధిస్తోంది.
ప్రభుత్వం తీరుపై సంఘాల విస్మయం
కుటుంబీకుల చేతిలో క్రూరంగా హింసకు గురై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ప్రత్యూషను ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎవరూ వచ్చి పరామర్శించకపోవడంపై పలు ప్రజా సంఘా లు విస్మయం వ్యక్తం చేశాయి. ఆర్థికంగా అదుకుంటారని అనుకుంటున్న ప్రజాప్రతినిథులు ఆవైపుగా చూడకపోవడంపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రత్యూషకు ఆర్థికంగా అండగా నిలవాలని అవి కోరుతున్నాయి.