రేవ్ పార్టీపై పోలీసుల దాడి
మేడ్చల్/ కుత్బుల్లాపూర్, న్యూస్‌లైన్: నగర శివార్లలోని రిసార్ట్‌లో జరుగుతున్న రేవ్‌పార్టీపై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు. 27 మంది యువకులు, పది మంది యువతులను, నలుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో బాలానగర్ డీసీపీ ఏ.ఆర్ శ్రీనివాస్ సోమవారం వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం ఉప్పర్‌పల్లిలో ఉన్న లియోనియా రిసార్ట్‌లోని విల్లా నంబర్ 74లో రేవ్ పార్టీ జరుగుతోందని సమాచారం అందడంతో ఆదివారం అర్ధరాత్రి సైబరాబాద్ ఎస్‌ఓటీ సీఐ వెంకట్‌రెడ్డి, బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్‌లు సిబ్బందితో దాడి చేశారు.
మద్యం, డ్రగ్స్ మత్తులో ఉండి, అశ్లీల నృత్యాలు చేస్తున్న 27 మంది యువకులు, 10 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు నిర్వాహకులు రమేష్, కరీముల్లా, సూర్యం, రాఖీ రాత్వాల్‌లనూ అరెస్ట్ చేశారు. ఘటనా స్థలంలో రూ. 4.45 లక్షల నగదు, 35 సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లతో పాటు కారును స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
లియోనియా రిసార్ట్‌లోని సంబంధిత విల్లా యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసింది ఉత్తర భారతదేశానికి చెందిన ఒక వ్యాపార సంస్థ అని, పట్టుబడిన వారిలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు, రియల్టర్లు, రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారని తెలిసింది. వారి వివరాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరించారు.