ఆర్థిక స్వేచ్ఛతోనే మహిళా సాధికారత
-కష్టాలకు తలొగ్గి కన్నీరు పెట్టొద్దు సమస్యలను సమర్థంగా ఎదుర్కోవాలి
- అంతర్జాతీయ మహిళా సదస్సులో టెస్సీ థామస్ ఉద్బోధ
సాక్షి, హైదరాబాద్ : జనాభాలో 50 శాతం ఉన్న మహిళల చేతిలో ఒక శాతం భూము లే ఉన్నాయని, సామాజిక, ఆర్థిక స్వేచ్ఛ లభించినప్పుడే మహిళలపట్ల వివక్ష తొల గిపోతుందని అగ్ని-4 మిస్సైల్స్(డీఆర్‌డీఓ) ప్రాజెక్ట్ డెరైక్టర్ డాక్టర్ టెస్సీ థామస్ అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమెన్స్ కాంగ్రెస్ ఆదివారం ప్రారంభమైంది. సదస్సుకు 50 దేశాల నుంచి వెయ్యిమందికిపైగా ప్రతి నిధులు హాజరయ్యారు.
చరిత్ర విభాగాధిపతి ప్రొఫెసర్ రేఖాపాండే రచించిన ‘ఏ జర్నీ ఇన్ టు విమెన్ స్టడీస్’ పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం థామస్ మాట్లాడుతూ అన్నిరంగాల్లోనూ మహిళలు అధికారిక ఆస్తుల విషయంలో నేటికీ వెనుకబడే ఉన్నారన్నారు. సమాజం కన్నా ఇంట్లోనే మహిళలు ఎక్కువ వివక్షకు గురవుతున్నారని చెప్పారు. అణు, సాంకేతిక రంగాల్లోనూ మహిళలు సమర్థంగా పని చేస్తు న్నా... నిర్ణయాధికారాల్లో ఆశించినస్థాయిలో భాగస్వామ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను గొప్ప శాస్త్రవేత్తనే అయినా ఇంట్లో అందరికన్నా ముందే నిద్రలేచి పిల్లలను స్కూలుకు రెడీ చేయాల్సి వచ్చేదని చెప్పారు.
సమస్యలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలే తప్ప ఏడుస్తూ కూర్చొవద్దని మహిళలకు సూచించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రామకృష్ణ రామస్వామి మాట్లాడుతూ మన దేశంలో అత్యున్నత రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి పదవుల ను సైతం మహిళలు అధిరోహించారని చెప్పారు. అయినా మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందని, దీన్ని పూర్తిగా రూపుమాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమావేశంలో వర్సిటీ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ వి.గీత, వుమెన్స్ వరల్డ్ కాంగ్రెస్ డిప్యూటీ డెరైక్టర్ ప్రొఫెసర్ వి.సీత తదితరులు పాల్గొన్నారు.