ఓ చెత్తకుండీ...16 లక్షల పాత కరెన్సీ!
చిత్తు కాగితాలు ఏరుకొనే మహిళకు దొరికిన వైనం
- హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో కలకలం
హైదరాబాద్: చిత్తు కాగితాలు ఏరుకొని జీవించే మహిళకు చెత్తకుండీలో రూ.16 లక్షల రద్దయిన పాత నోట్ల కట్టలు దొరికాయి. గురువారం నేరేడ్‌మెట్ ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ వివరాలను సీఐ జగదీశ్‌చందర్ విలేకరులకు వెల్లడించారు.
చిత్తు కాగితాలు సేకరించి జీవనం సాగించే నేరేడ్‌మెట్ వాజ్‌పేయినగర్‌వాసి చందా గంగూబాయి (58).. గురువారం ఉదయం సమీపంలోని రైల్వేగేట్ వద్దకు వెళ్లింది. అక్కడి చెత్త కుండీలో కాగితాలు సేకరిస్తుండగా... ఆమెకు పాత రూ.500, రూ.1000 నోట్ల కట్టలు కనిపించాయి. ఇవి చూసి దిగ్భ్రాంతికి గురైన ఆమె.. స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడకు చేరుకున్న పోలీసులు నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.16 లక్షలని తేల్చారు. దీనిపై కేసు నమోదు చేశామని, ఈ నోట్లు ఎవరు పడేశారనేది తెలుసుకొనేందుకు దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు.
రూ.1.2 కోట్ల పాత నోట్లు స్వాధీనం
మార్పిడికి యత్నిస్తున్న ముగ్గురి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: రద్దయిన పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి యత్నిస్తున్న ముఠాను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రూ.1.2 కోట్ల పాత కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ బి.లింబారెడ్డి గురువారం వెల్లడించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన సలీమ్ మెహిదీపట్నంలో ఉంటూ కరాటే కోచ్‌గా పనిచేస్తున్నాడు. మంచిర్యాలకు చెందిన ఇతడి బంధువులు, స్నేహితుల్లో అనేక మంది రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రద్దయిన పాత నోట్లు తమ వద్ద ఉన్నాయని, కమీషన్ పద్ధతిలో వాటిని మార్పిడి చేసిపెట్టాలని గత నెలలో వారు కోరడంతో సలీమ్ అంగీకరించాడు.
మొత్తం రూ.1.2 కోట్ల విలువైన పాత నోట్లను తీసుకుని హైదరాబాద్‌కు చేరుకున్నాడు. వీటిని మార్చేందుకు కూకట్‌పల్లికి చెందిన రియల్‌ఎస్టేట్ దళారి ఎల్.సుబ్బారెడ్డి, విజయ్‌నగర్‌కాలనీకి చెందిన టెంట్‌హౌస్ వ్యాపారి ఎండీ అలీమ్ సహకారం కోరాడు. దీనికి వారు అంగీకరించడంతో ముగ్గురూ కలసి మార్చేందుకు గురువారం కారులో నగదు తీసుకుని పంజగుట్ట ప్రాంతానికి వచ్చారు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం దాడి చేసి ముగ్గురినీ అదుపులోకి తీసుకుంది. రద్దయిన నోట్లను స్వాధీనం చేసుకుని, కేసును పంజగుట్ట పోలీసులకు అప్పగించింది.