హైదరాబాద్: భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు ఈ నెల 18 నుంచి 22 వరకు నగరంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు తెలిపారు. శనివారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జాతీయ మహాసభల ప్రచార బెలూన్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 4 రోజులపాటు జరిగే అఖిల భారత మహాసభలకు సీపీఎం జాతీయ నాయకులు సీతారాం ఏచూరి, బృందాకారత్, కేరళ సీఎం పినరై విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, ఇతర వామపక్షాల నేతలు హాజరవుతారని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. పార్టీ నూతన కమిటీలో మార్పులు, చేర్పులు ఉంటాయన్నారు. మహాసభ సందర్భంగా నగరాన్ని ఎరుపురంగు తోరణాలతో అలంకరిస్తున్నట్లు వివరించారు. మహాసభలకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ నెల 22న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బహిరంగ సభ జరుగుతుందని, సభకు లక్షలాదిగా ప్రజలు తరలిరావాలని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, డి.జి.నర్సింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు సాగర్, ఎస్.రమ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి భూపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment