శ్రీలంక తరహా సంక్షోభం దేశంలోనూ రావొచ్చు: సీపీఐ | CPI 3rd Rastra Mahasabhalu Begins At Telangana Shamshabad | Sakshi
Sakshi News home page

శ్రీలంక తరహా సంక్షోభం దేశంలోనూ రావొచ్చు: సీపీఐ

Published Tue, Sep 6 2022 2:50 AM | Last Updated on Tue, Sep 6 2022 3:15 PM

CPI 3rd Rastra Mahasabhalu Begins At Telangana Shamshabad - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘దేశంలోనూ శ్రీలంక తరహా ఆర్థిక, రాజకీయ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. ఆ సమయంలో పుట్టుకొచ్చే ప్రజా ఆందోళనలకు నాయకత్వం వహించేందుకు వామపక్ష పార్టీలన్నీ సిద్ధంగా ఉండాలి. ఇందుకు సైద్ధాంతికంగా ఎర్ర జెండాలన్నీ ఏకం కావాలి..’ అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. మతో న్మాద బీజేపీని ఎదుర్కొవాలంటే సీపీఐ, సీపీఎంల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను  పక్కన పెట్టి పని చేయాలని అన్నారు. ఇందుకు 2 పార్టీల జాతీయ నాయకత్వం చొరవ చూపాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సీపీఐ తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభల్లో భాగంగా సోమవారం ఆయన ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు.

మతోన్మాద బీజేపీని ఐక్యంగా ఎదుర్కోవాలి
‘నయా ఉదారవాద ఆర్థిక విధానాల వల్ల దేశవ్యాప్తంగా అనేక మార్పులు చోటు చేసు కున్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు దాసోహమైంది. ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రజల మధ్య అంతరాలూ పెరిగాయి. ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమై, ఆశించిన స్థాయిలో ఉపాధి అవకాశాలు లేక యువత తీవ్రమైన అసహ నం, ఆగ్రహంతో రోడ్డెక్కుతోంది. మరోవైపు మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌ చేతుల్లో కీలుబొమ్మగా మారారు. బహుళ మతాలు, కులాలు, ప్రాంతాలు ఉన్న ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రపన్నారు. హిందూమత రాజ్యస్థాపనే లక్ష్యంగా చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారు. మతోన్మాద బీజేపీని, దాని వెనుక ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు ఎర్రజెండా పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది..’ అని రాజా పేర్కొన్నారు.

రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం
‘మోదీ ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పాలన కొనసాగిస్తోంది.  రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రాల హక్కులను హరిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు, నేతలపై సీబీఐ, ఐటీ దాడులు చేయించి వారిని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చేందుకు లెప్టినెంట్‌ గవర్నర్, గవర్నర్‌ వ్యవస్థలను ఉపయోగించుకుంటోంది. 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఇప్పటినుంచే ఏకమై పని చేయాలి..’ అని రాజా స్పష్టం చేశారు.

ఐక్యత చాటుతాం: రామకృష్ణ
కమ్యూనిస్టులు ఏకం కావాల్సిన ఆవశ్యకతపై వామపక్ష మేధావులంతా చర్చించాలని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ సూచించారు. అక్టోబర్‌లో విజయవాడ కేంద్రంగా నిర్వహించే జాతీయ మహా సభల సందర్భంగా వామపక్ష పార్టీలన్నీ భుజం భుజం కలిపి భారీ ర్యాలీ నిర్వహించడం ద్వారా ఐక్యతను చాటి చెబుతాయని చెప్పారు.

సీపీఐ ప్రతిపాదనను సమర్థిస్తున్నా: తమ్మినేని
సైద్ధాంతిక ప్రాతిపదికన కమ్యూని స్టులంతా ఏకం కావాలనే సీపీఐ ప్రతిపా దనను సమర్థిస్తున్నట్లు సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలి పారు. మతోన్మాద బీజేపీకి ప్రత్యా మ్నా య శక్తిగా నిలబడే సత్తా కమ్యూనిస్టులకే ఉందన్నారు. మోదీ ప్రభుత్వం ఉన్మాదంతో, ఉద్వేగంతో ప్రజలను రెచ్చగొడు తోందని, ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమా దకారిగా మారిందని విమర్శించారు.

సాయుధ పోరాటంతో బీజేపీకి సంబంధమే లేదు: సురవరం
తెలంగాణ సాయుధ పోరాటానికి, బీజేపీకి సంబంధమే లేదని సీపీఐ సీనియర్‌ నేత సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీతో పాటు ఎంఐఎం, టీఆర్‌ఎస్‌లు కూడా తామే పోరాటం చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. వాస్తవానికి ఈ పోరాటానికి పూర్తిగా కమ్యూనిస్టులే నాయకత్వం వహించారని తెలిపారు.

ఇదీ చదవండి: 2024: ఢిల్లీ ‘పవర్‌’ మనదే.. దేశమంతా ఫ్రీ పవరే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement