జహంగీర్ నామినేషన్ దాఖలు సందర్భంగా డప్పు వాయిస్తున్న బీవీ రాఘవులు
సీఎం రేవంత్‌పై సీపీఎం నేత రాఘవులు ధ్వజం
బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్‌తో కలసి పనిచేసేందుకు సిద్ధం
సాక్షి, యాదాద్రి: కేరళకు వెళ్లి సీపీఎంను తిట్టేంత సమయం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీజేపీపై పోరాడటానికి మాత్రం లేదని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికినట్లు.. కేరళకు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయ్‌ని రేవంత్ విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన ఓటుకు నోటు సంగతి ఏమైందని ప్రశ్నించారు. భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి సీపీఎం అభ్యర్థిగా ఎండీ జహంగీర్ నామినేషన్ దాఖలు సందర్భంగా జరిగిన బహిరంగసభలో రాఘవులు పాల్గొన్నారు.
ఈ సభలో మాట్లాడుతూ, నోరు పారేసుకోవద్దని రేవంత్‌రెడ్డికి సూచించారు. కేసీఆర్ అహంకారంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని, సీఎం రేవంత్ ఆ బాటలో నడవద్దని అన్నారు. కేరళలో బీజేపీ, కమ్యూనిస్టులు కలసి పనిచేస్తున్నారని రేవంత్ పేర్కొనడం అతని అవివేకం అని అన్నారు. కేరళ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేసిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు.
కవితను బీజేపీ జైల్లో పెట్టిందని, ఇప్పటికైనా బీఆర్‌ఎస్ ఇండియా కుటమిలోకి రావాలని సూచించారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడాలని ఆయన ప్రజలను కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌తో కలసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాఘవులు అన్నారు.
మమ్మల్ని కలుస్తామని కాంగ్రెస్ సమాచారం ఇచ్చింది : తమ్మినేని
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీని ఓడించడానికి అందరితో కలసి వెళ్తామని, ఇండియా కూటమి పార్టీలను కాంగ్రెస్ సంప్రదిస్తూ పెద్దన్న పాత్ర పోషించాలని అన్నారు. ఈ నెల 21న కాంగ్రెస్ నాయకత్వం సీపీఎంను కలవనున్నట్లు సమాచారం ఇచ్చిందని వెల్లడించారు. అయినప్పటికీ తెలంగాణలో భువనగిరి నుంచి సీపీఎం పోటీచేయడం ఖాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment