భాగ్యనగరిలో బాలానందం
19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు ఆతిథ్యం ఇస్తున్న భాగ్యనగరి బాలల సందడితో నిండిపోయింది. చిత్రాలను వీక్షించేందుకు పలు దేశాల నుంచి భిన్న సంస్కృతుల పిల్లలు రావడంతో ప్రధాన వేదిక ప్రసాద్ ఐమాక్స్, శిల్పారామంలో పండుగ సందడి నెలకొంది. సాంస్కృతిక వేదిక రవీంద్రభారతి నాట్య సౌరభాలతో గుబాళిస్తోంది. ఐదురోజులుగా సాగుతున్న సినిమా పండుగ నేటితో ముగియనుంది. - సాక్షి, హైదరాబాద్
బిడ్డ కోసం ఓ తల్లి వేదన..
తెల్ల రంగులోని ఒంటెను ఎక్కడైనా చూశారా..? కేవలం రష్యాలో కనబడే ఈ ఒంటెలు పుడితే అదృష్టమని అక్కడి వారి నమ్మకం. విశేషం ఏంటంటే.. కరెక్ట్‌గా మేఘాలు కూడా ఒంటె ఆకారంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఒంటెలు పుడతాయట. వీటిని ‘సెలస్టియల్ కామిల్స్’ అంటారు. ఇలాంటి తమాషా కథాంశంతో తల్లీ బిడ్డల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన రష్యా చిత్రం ‘సెలస్టియల్ కామిల్’. బిడ్డ దూరమైతే తల్లి పడే బాధ వర్ణనాతీతం. మనుషులైతే తమ బాధను చెప్పుకోగలరు. మరి నోరులేని జీవుల పరిస్థితి ఏంటి..? దక్షిణాది రష్యాలో ఎడారి ప్రాంతంలో ఉన్న ఓ కుటుంబం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఆ కుటుంబ పెద్దకి ముగ్గురు పిల్లలు. వారితో పాటు ఓ ఒంటె, కొన్ని గొర్రెలు ఉంటాయి. ఇంతలో ఈ ఒంటెకి తెల్ల రంగులో ఉన్న పిల్ల పుడుతుంది. కానీ అక్కడి కి వచ్చిన రష్యా చిత్ర బృందం ఆ ఒంటెను చూసి తమ సినిమా కోసం డబ్బు ఆశ చూపించి ఆ పిల్లను తీసుకెళ్లిపోతారు. కళ్ల ముందే తన బిడ్డను తీసుకెళ్లిపోతుంటే తల్లి ఒంటె ఎంతో బాధ పడుతుంది. తర్వాత పిల్లను వెతుక్కుంటూ ఇంటి నుంచి పారిపోతుంది. ఈ ఒంటె లేకపోతే ఆ కుటుంబానికి నీళ్లుండవు. ఎందుకంటే ఎంతో లోతుకి తోడితే గానీ బావిలోంచి నీళ్లు రావు. తమ కుటుంబంలో భాగమైన ఒంటెను, దాని పిల్లను వెతకడానికి ముగ్గురు పిల్లల్లో ఒకరైన బెయర్ బయలుదేరతాడు. వాటి జాడ తెలుసుకున్నాడా లేదా అన్నది కథ. రష్యాకు చెందిన యూరి ఫిటింగ్ ఈ చిత్రానికి దర్శకుడు.
పండుగలో మధు‘హారం’
ప్రస్తుత కాలంలో పిల్లలకు పుస్తకాలే ప్రపంచమైపోయింది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మార్కుల పరుగు పందెంలో తమలో ఉన్న ప్రతిభను గుర్తించడం లేదు. తల్లిదండ్రులు గుర్తించినా ప్రోత్సహించడం లేదు. అయితే, ఖైరతాబాద్ నాజర్ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న మధుమాల తన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకుంటూ ‘ఐ యామ్ డిఫరెంట్’ అంటోంది. పేపర్‌తో భిన్న ఆర్టికల్స్ తయారు చేసి తనలోని సృజనకు పదును పెడుతోంది. అంతేకాదండోయ్.. ఈ బాలిక తన వస్తువులకు బాలల చలన చిత్రోత్సవాలను ‘మార్కెట్’గానూ మలచుకొంది. గురువారం ప్రసాద్ ఐమాక్స్ ప్రాంగణంలో ఆమె పెట్టిన ‘పేపర్ జ్యువెలరీ’ స్టాల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మధుమాల మాట్లాడుతూ.. ‘నాకు గ్లాస్ పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. ఏడో తరగతిలో ఉన్నప్పుడు ఓ ఎగ్జిబిషన్‌లో పేపర్‌తో చేసిన చైన్స్ చూశా. ఇంకా కొత్తగా చేయాలనిపించింది. అమ్మా,నాన్నల ప్రోత్సాహంతో వీటిని తయారు చేయడం స్టార్ట్ చేశా. మంచి రెస్పాన్స్ వచ్చింది’ అని చెప్పుకొచ్చింది. ‘వీటి తయారీకి ఉపయోగించే పేపర్ కేవలం ముంబై, పుణెల్లోనే దొరుకుతుంది. ప్రతి ఆర్టికల్ చేత్తోనే తయారు చేస్తా. మా స్కూల్లో జరిగిన ఓ వేడుకలో వీటిని ప్రదర్శనకు పెట్టాను. అందరూ బాగున్నాయన్నారు. ఫిలిం ఫెస్టివల్ మొదటి రోజునే ప్రదర్శనకు పెడదామనుకున్నా. కానీ నాకు ఆ రోజు నుంచి ఎగ్జామ్స్. ఈ రోజు కూడా పరీక్ష రాసి ఈ స్టాల్‌కు వచ్చాను. చూసినవారందరూ నా వర్క్‌ను మెచ్చుకుంటున్నారు.’ అని వివరించింది.