కల్వకుర్తిలో అదనంగా 20 టీఎంసీల రిజర్వాయర్లు
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కసరత్తు చేస్తున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని 15 మండలాల పరిధిలోని సుమారు 3.40 లక్షల ఎకరాలకు సాగునీరం దించే మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అదనంగా మరో 20 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 18 చిన్న రిజర్వాయర్లను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు వేస్తోంది. వీటి నిర్మాణాలకు ప్రాథమికంగా రూ. 811 కోట్ల మేర ఖర్చవుతుందని అధికారులు తేల్చగా పూర్తిస్తాయి సర్వే కొనసాగుతోంది. నిజానికి శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద 25 టీఎంసీల మిగులు జలాలను తీసుకుంటూ 2005లో ఈ ప్రాజెక్టును రూ. 2,990 కోట్లతో మొదలు పెట్టారు.
ప్రాజెక్టు మొత్తాన్ని 3 దశలుగా విడగొట్టారు. ఇందులో కొల్లాపూర్ స్టేజ్–1 కింద 13 వేల ఎకరాలు, జొన్నల బొగడ స్టేజ్–2 కింద 47వేల ఎకరాలు, గుడిపల్లె గట్టు స్టేజ్–3 కింద సుమారు 2.80 లక్షల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అనంతరం ప్రాజెక్టుకు మొదట కేటాయించిన నీటి వాటాను 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచారు. నీటిని తీసుకునే రోజులను 90 నుంచి 120 రోజులకు పెంచారు. అదనంగా వనపర్తి నియోజకవర్గ పరిధిలో ఘన్‌పూర్ మండల పరిధిలో మరో 25 వేల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళికలు వేశారు. దీంతో ప్రాజెక్టు వ్యయం రూ.4,896 కోట్లకు పెరిగింది. అయితే ప్రాజెక్టులో గతంలో కేవలం 3.396 టీఎంసీల సామర్థ్యంతో మాత్రమే రిజర్వాయర్లను నిర్మించారు. దీంతో వరద వచ్చినపుడు నీటిని నిల్వ చేసుకునేందుకు పెద్దగా రిజర్వాయర్లు లేకపోవడంతో అదనంగా 20.61 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించాలన్న ప్రతిపాదనను గత ఏడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ తెరపైకి తెచ్చారు.