చర్యలేవీ?
‘ఉపాధి హామీ’ అక్రమార్కులకు వరంగా మారింది. పేదల పథకం పక్కదారి పడుతోంది. జిల్లాలో తవ్వినకొద్దీ అవినీతి గుట్టు రట్టవుతోంది. సామాజిక తనిఖీల పేరుతో హడావుడి చేస్తున్న అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యులపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇప్పటివరకు జరిగిన పనుల్లో రూ.20కోట్ల పైనే అవినీతి జరిగినట్టు తేల్చినా.. రికవరీ చేయడంలో అధికారులు తాత్సారం వహిస్తున్నారు.
మహబూబ్‌నగర్ వ్యవసాయం : మహాత్మాగాంధీ జాతీయ ఉపా ది హామీ పథకం లో అక్రమాలకు అడ్డులేకుండా పో యింది. క్షేత్రస్థాయి నుంచే కట్టడి చేయాల్సిన అధికారులు వాటిని పట్టించుకోకపోవడం వల్ల రోజురోజుకూ అక్రమాలు పెరుగుతున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు విచారించాల్సిన జిల్లా నిఘా అధికారి నాలుగు నెలలుగా పత్తా లేకుండాపోయారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అక్రమార్కులపై చర్య లు తీసుకున్న దాఖలాలు లేవు. జిల్లాలో ఇప్పటివరకు ఉపాధి హామీ పథకంలో రూ.20కోట్ల 55లక్షల అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ బృందం తేల్చింది. జిల్లా మొత్తంగా ఇప్పటికే అధికారులు ఐదుసార్లు సామాజిక తనిఖీలు పూర్తి చేశారు. ఆరోసారి తనిఖీ చేసేం దుకు సిద్ధమవుతున్నారు. పూర్తి చేసిన తనిఖీల్లో బయటపడిన అక్రమాలపై జిల్లా విజిలెన్స్ ఉన్నతాధికారులు విచారణ చేశారు. వాటిలో ఇప్పటి వరకు అక్రమార్కుల నుంచి రూ.3కోట్ల 55లక్షలు మాత్రమే రికవరీ చేశారు. ఇంకా రూ.6కోట్ల 62లక్షలు వసూలు చేయాల్సి ఉంది.
డీవీఓ లేక నిలిచిన రికవరీ
గతంలో ఇక్కడ పనిచేసిన జిల్లా విజిలెన్స్ అధికారి సుబ్రమణ్యంపై పలు ఆరోపణలు రావడంతో ఇక్కడి నుంచి ఇతర జిల్లాకు బదిలీపై వెళ్లారు. నాలుగు నెలలుగా డీవీఓ విధుల్లో లేకపోవడంతో అవినీతిపై జరిగే విచారణలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అంతేకాకుండా సామాజిక తనిఖీలో దోషులుగా గుర్తించిన ఉద్యోగులకు జరిగే పర్సనల్ హియరింగ్ కూడా వాయిదా పడుతూ వస్తోంది. ఈ పరిస్థితి వల్లే అవినీతిపై ఇంకా విచారణ పెండింగ్‌లో ఉంది.
ఆరోపణలివే...
ఈ ఏడాది ఫిబ్రవరిలో తాడూర్ మండలానికి చెందిన ఓ ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి డీవీఓ వేధింపులే కారణమని పేర్కొంటూ ఉపాధిహామీ పథకంలో పనిచేసే ఉద్యోగులు అప్పట్లో ధర్నా చేపట్టారు. అందుకు స్పందించిన కలెక్టర్ గిరిజాశంకర్ ఈ వివాదంపై విచారణకు ఆదేశించారు. విచారణ ముగిసిన అనంతరం మరో నెలన్నరకు డీవీఓ విధుల్లో చేరారు. ఈ విషయం తెలియడంతో డ్వామా ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆయన కొన్ని రోజులు ఎన్నికల విధులు నిర్వహిం చారు. ఎన్నికలు ముగియగానే ఇతర జిల్లాకు బదిలీపై వె ళ్లారు.
అయోమయంలో ఉద్యోగులు
జిల్లాలో 5357మంది ఉపాధి సిబ్బంది, ఇతరులపై 20కోట్ల 55లక్షల అవినీతికి పాల్పడినట్లు సామాజిక తనిఖీ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందులో అత్యధికంగా 1197 ఫీల్డ్‌అసిస్టెంట్‌లు 9కోట్ల73లక్షల అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. 759 మంది టెక్నికల్ అసిస్టెంట్‌లు 5కోట్ల 51లక్షలు, 28 మంది ఎంపీడీఓలు కోటి రూపాయలు, 65మంది ఏపీఓలు 33లక్షలు, 31మంది ఏఈఈలు కోటి రూపాయలు, 2200మంది మేట్లు రూ.కోటి 14లక్షల అవినీతికి పాల్పడ్డట్లు సామాజిక తనిఖీ బృందం గుర్తించింది. ఆ వెంటనే చాలా మంది ఫిల్డ్‌అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లను, మేట్లను అధికారులు సస్పెండ్ చేశారు. వీరిపై ఉన్న అభియోగాలు నిజమా.. కాదా అనేది తేల్చాల్సిన విజిలెన్స్ విభాగం అధికారులు అందుబాటులో లేకుండాపోయారు. దీనివల్ల సస్పెండ్ అయిన వారంతా తమపై వచ్చిన అభియోగాల విషయంలో సమాధానం ఇచ్చేందుకు నిత్యం డ్వామా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
ఉన్నతాధికారులు వెంటనే స్పందించి జిల్లాకు వెంటనే డీవీఓను నియమిస్తే అక్రమాలకు పాల్పడని వారు తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది. అలాగే అవినీతికి పాల్పడిన వారి నుంచి వీలైనంత త్వరగా డబ్బులు రికవరీ చేసేందుకు మార్గం సులువవుతుందని ఉద్యోగులు అంటున్నారు. ఉన్నతాధికారులు వెంటనే నిర్ణయం తీసుకోవాలని, డీవీఓను నియమించాలని కోరుతున్నారు.