అక్టోబర్‌లో 27 జిల్లాలకు కమిటీలు | 27 districts to Congress Committes in October | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌లో 27 జిల్లాలకు కమిటీలు

Published Sat, Oct 1 2016 2:47 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

అక్టోబర్‌లో 27 జిల్లాలకు కమిటీలు

అక్టోబర్‌లో 27 జిల్లాలకు కమిటీలు

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం 27 జిల్లాలు ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో కొత్తగా డీసీసీ అధ్యక్షుల నియామకాలను ఈ అక్టోబర్‌లోనే పూర్తిచేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...  రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ఈ రెండున్నరేళ్లలోనే చాలా తప్పులు చేసిందన్నారు. రైతులు, యువకులు, దళితులు, మహిళలకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు.

ప్రజా సమస్యలు, హామీల అమలుకోసం పోరాటం చేయడానికి వెంటనే జిల్లా కమిటీల నియామకం పూర్తిచేస్తామని, అంతకన్నా ముందుగా టీపీసీసీకి పూర్తిస్థాయి కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. టీపీసీసీకి కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల నియామకాన్ని నాలుగైదు రోజుల్లోనే పూర్తిచేస్తామన్నారు. కార్యవర్గంలో నియామకాలపై ప్రతిపాదనలకోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు నాగయ్య అధ్యక్షతన ఐదుగురితో ఓ కమిటీని వేసినట్టు వెల్లడించారు. ఈ కమిటీ ప్రతిపాదనల మేరకు దాదాపు 40 మందికి అవకాశం రావచ్చునని చెప్పారు.

కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు గుండెకాయ వంటిదని, అలాంటి ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ముందుచూపుతో నిర్మించిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్‌పార్టీకి పేరు వస్తుందనే భయంతో దానిని పక్కనపెట్టి కాళేశ్వరం పేరుతో కొత్త ప్రాజెక్టుకు కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ఎల్లంపల్లి సహా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తామని, టీఆర్‌ఎస్ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరిస్తామని ఆయన చెప్పారు.
 
రైతులను ఆదుకోవడంలేదు: పంటరుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీనిచ్చిన టీఆర్‌ఎస్ .. రైతులను మోసం చేసిందని ఉత్తమ్ విమర్శించారు. ఇప్పటిదాకా కేవలం రెండు దఫాల్లో కొంత మాత్రమే మాఫీ చేసిందని, మూడో దఫా నిధులను ఇంకా బ్యాంకుల్లో జమచేయలేదని అన్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు. వీటిపై టీపీసీసీ క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమవుతోందని ఉత్తమ్ వెల్లడించారు.
 
3 నుంచి ప్రచార కమిటీ సమావేశాలు
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాట కార్యాచరణ, కాంగ్రెస్‌పార్టీ సిద్ధాంతాలు, ప్రచార వ్యూహంపై చర్చించడానికి అక్టోబర్ 3 నుంచి 7వ తేదీదాకా ప్రచార కమిటీ జిల్లాల వారీగా సమావేశాలను నిర్వహించనుంది. 3న శిక్షకుల సమావేశం, 4న నిజామాబాద్‌లో.. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల సమావేశాలు ఉంటాయని కమిటీ కన్వీనర్ నాగయ్య, కో కన్వీనరు మల్లు రవి వెల్లడించారు. 5న వరంగల్‌లో.. వరంగల్, కరీంనగర్ జిల్లాలు, 6న మహబూబ్‌నగర్‌లో.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు, 7న సూర్యాపేటలో ఖమ్మం, నల్లగొండ జిల్లాల సమావేశాలుంటాయని వారు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement