
4 రోజుల్లో టీపీసీసీకి పూర్తి కార్యవర్గం: ఉత్తమ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుకానున్న 27 జిల్లాలకు కొత్తగా డీసీసీ అధ్యక్షుల నియామకాలను అక్టోబరులోనే పూర్తిచేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ఈ రెండున్నరేళ్లలోనే చాలా తప్పులు చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్ అమలుచేయడం లేదని విమర్శించారు. రైతులు, యువకులు, దళితులు, మహిళలకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.
వీటిపై పోరాటం చేయడానికి వెంటనే జిల్లా కమిటీలను పూర్తిచేస్తామని, అంతకన్నా ముందుగా టీపీసీసీకి పూర్తిస్థాయి కార్యవర్గాన్ని కూడా పూర్తిచేస్తామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. టీపీసీసీకి కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల నియామకాన్ని నాలుగైదు రోజుల్లోనే పూర్తిచేస్తామన్నారు. కమిటీలో ప్రతిపాదనలకోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు నాగయ్య అధ్యక్షతన ఐదుగురితో కమిటీని కూడా వేసినట్టుగా వెల్లడించారు. ఈ కమిటీ ప్రతిపాదనల మేరకు 40 మందికి అవకాశం రావచ్చునని చెప్పారు.