ప్రభుత్వోద్యోగులకు 3.14 % డీఏ పెంపు | 3.14 percent DA hike for T.N. government employees | Sakshi
Sakshi News home page

ప్రభుత్వోద్యోగులకు 3.14 % డీఏ పెంపు

Published Mon, Feb 8 2016 1:48 AM | Last Updated on Thu, Aug 16 2018 3:23 PM

ప్రభుత్వోద్యోగులకు 3.14 % డీఏ పెంపు - Sakshi

ప్రభుత్వోద్యోగులకు 3.14 % డీఏ పెంపు

రాష్ట్ర కేబినెట్  నిర్ణయం.. 2015 జూలై నుంచి వర్తింపు
మార్చి తొలి వారంలో బడ్జెట్ సమావేశాలు
దుమ్ముగూడెం ప్రాజెక్టు రీ డిజైన్‌కు ఆమోదం
రామ సాగర్ సాగునీటి ప్రాజెక్టుగా నామకరణం
రాష్ట్రంలో కొత్తగా హార్టికల్చర్ కార్పొరేషన్
పాడికి ప్రోత్సాహకంపై మంత్రివర్గ ఉప సంఘం
తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధిపై మరో సబ్ కమిటీ
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ
వివరాలు వెల్లడించిన మంత్రి హరీశ్‌రావు

 
 
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువుభత్యం(డీఏ) పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2015 జూలై 1 నుంచి పెరిగిన కరువు భత్యం చెల్లింపులకు పచ్చజెండా ఊపింది. పీఆర్‌సీ సిఫారసు మేరకు ఉద్యోగులకు 3.14 శాతం డీఏ పెరగాల్సి ఉంది. కానీ నారాయణఖేడ్ ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వం డీఏ పెంపు నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. తాజా డీఏ పెంపుతో దాదాపు నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది.
 
 సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి హరీశ్‌రావు డీఏ విషయాన్ని దాటవేశారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి మొదటి వారంలో జరపాలని నిర్ణయం తీసుకున్నామని హరీశ్ తెలిపారు. బడ్జెట్ రూపకల్పనే ప్రధాన ఎజెండాగా ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
 
 ఖమ్మం జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించ తలపెట్టిన దుమ్ముగూడెం ప్రాజెక్టు రీడిజైన్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 50 టీఎంసీల సామర్థ్యంతో రూ.7,900 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు శ్రీరామసాగర్ ప్రాజెక్టుగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గతంలో చేపట్టిన ఇందిరా, రాజీవ్ సాగర్, దుమ్ముగూడెం ప్రాజెక్టులు రీడిజైన్ చేసి సాగునీరు అందని కరువు పీడిత ప్రాంతాల కు నీరు అందిస్తామన్నారు.
 
 విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు రూ.4 ప్రోత్సాహకంగా ఇస్తున్నామని, ఇతర డెయిరీలకు పాలు పోసే వారికి కూడా ఈ ప్రోత్సాహకం అందజేయాలన్న డిమాండ్ నల్లగొండ, కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చిందన్నారు. దీంతో ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ ఉపసంఘానికి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చైర్మన్‌గా మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్వర్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి సభ్యులు ఉంటారన్నారు.
 
 తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి మరో మంత్రివర్గ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీనికి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చైర్మన్‌గా ఉంటారని, మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్‌రావు సభ్యులుగా ఉంటారనన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం గతంలోనే కేబినెట్ నిర్ణయం తీసుకుందని, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఏపీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చట్టాన్ని అడాప్ట్ చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియను ఆయా శాఖలు త్వరిత గతిన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా హార్టికల్చరల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, కొత్తగా ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు.
 
 కూరగాయలు, పండ్ల సాగు పెంచుతాం..
 రాష్ట్రంలో కూరగాయలు, పండ్లు, పూల సాగును పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఇవి ప్రస్తుతం 6.65 లక్షల హెక్టార్లలో సాగవుతున్నాయని, 3.70 కోట్ల జనాభా అవసరాలకు 67.83 లక్షల టన్నుల ఉత్పత్తులు అవసరం అవుతున్నాయన్నారు. అందువల్ల వీటి సాగును మరో 4,400 హెక్టార్లకు విస్తరిస్తామని చెప్పారు. ఆహార పదార్థాల్లో కల్తీ నివారణకు హార్టీకల్చర్ కార్పొరేషన్ ద్వారా 200 ఎకరాల్లో ప్రాసెస్ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా గోదావరి జలాలపైనే ఆధారపడిందన్నారు.
 
 గతంలో గోదావరిపై ప్రారంభించిన పథకాలు నిరుపయోగం కావడంతోపాటు జిల్లాలోని కొన్ని మండలాలు ఏపీకి వెళ్లడంతో ఆ ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశం ప్రభుత్వానికి రాలేదన్నారు. మంత్రి హరీశ్ ఏపీని సంప్రదించినా.. ఆ ప్రభుత్వం స్పందించలేదని చెప్పారు. ఖమ్మం రైతుల సాగునీటి అవసరాలు తీర్చేందుకు చొరవ తీసుకున్నందుకు జిల్లా ప్రజల తరపున సీఎంకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.
 
 గోదావరి నికర జలాల్లో కేటాయించిన 50 టీఎంసీలనే ఈ ప్రాజెక్టుకు వాడుకుంటున్నందున ఎలాంటి అనుమతులు అక్కర్లేదన్నారు. దాదాపు మూడున్నర గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. తొలి రెండు గంటలూ బడ్జెట్ తయారీ, ప్రతిపాదనల రూపకల్పనపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. అనంతరం ఎజెండాలోని అంశాలను చర్చించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు హాజరయ్యారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement