వెంకన్న దర్శనానికి వెళుతూ..
నలుగురు హైదరాబాదీల దుర్మరణం
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్: అప్పు తీసుకుని తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని పట్టుకుని... అటునుంచి వెంకన్న దర్శనం చేసుకుందామని తిరుపతికి బయలుదేరిన నలుగురు నగరవాసులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌కు చెందిన స్నేహితులు హన్మంతరెడ్డి(40), శ్రీనివాస్‌రెడ్డి (35), కిషన్‌రెడ్డి (38) వివిధ జిల్లాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడ్డారు. వీరంతా వేర్వేరు పరిశ్రమల్లో పనిచేస్తూ చిన్నపాటి ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన స్నేహితులు తిరుపాల్‌రెడ్డి(38), ప్రేమ్‌సుందర్‌రెడ్డి(42) ఎల్‌అండ్‌టీలో పనిచేస్తున్నారు.
మరొకరి పరిస్థితి విషమం...
కాగా, బుధవారం రాత్రి స్థానికంగా ఓ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన వీరు... 7.30 ప్రాంతంలో తిరుపతికి బయలుదేరారు. వీరి వద్ద రూ.10 లక్షల అప్పుతీసుకున్న తిరుపతికి చెందిన వ్యక్తి తప్పించుకు తిరుగుతున్నాడు. ఆచూకీ లభించడంతో అతడి నుంచి బాకీ వసూలు చేసుకుని, అనంతరం తిరుమల వెంకన్న దర్శనం కూడా చేసుకుందామని తిరుపతికి కారులో పయనమయ్యారు.
కాగా, గురువారం ఉదయం తిరుపతి–శ్రీకాళహస్తి ప్రధాన రహదారిలో రేణిగుంట మండలం వెదుళ్లచెరువు వద్ద వేగంగా వచ్చిన ఓ లారీ వీరి కారును ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జయింది. ఐదుగురిలో శ్రీనివాస్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, ప్రేమ్‌సుందర్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. తిరుపాల్‌రెడ్డి చికిత్స పొందుతూ మరణించాడు. హన్మంతరెడ్డి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
కాగా పాకాల మండలంలోని పెరుమాళ్లగుడి పల్లి వద్ద గురువారం ఉదయం ట్యాంకరు ట్రాలీ బోల్తా పడిన మరో ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. వీరు కుక్కలపల్లి హరిజనవాడకు చెందిన సుబ్బరాయలు(54), మధుసూధన్(34).