గ్రేటర్‌లో 52 కొత్త సబ్‌స్టేషన్లు
► రంగారెడ్డిలో 25, హైదరాబాద్‌లో 27 నిర్మాణం
► రూ.180 కోట్లతో డిస్కం ప్రతిపాదనలు
సాక్షి, సిటీబ్యూరో: కోర్‌సిటీలో గృహోపకరణాల వినియోగం రెట్టింపుకావడం, అవుట ర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా కొత్త కాలనీలు పుట్టుకొస్తుండటం వల్ల గతంతో పోలిస్తే ప్రస్తుతం విద్యుత్ వినియోగం రెట్టింపైంది. పెరుగుతున్న ఈ డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా వ్యవస్థ మెరుగు పడలేదు. నగరవాసుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్‌లో కొత్తగా 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 52 చోట్ల నిర్మించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నిర్ణయించింది. ఒక్కో సబ్‌స్టేషన్‌కు సగటున రూ.2.5 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు ఖర్చు కానున్నట్లు అంచనా వేసింది. హైదరాబాద్ కోర్‌సిటీలో 27 సబ్‌స్టేషన్లు, రంగారెడ్డి అర్బన్‌లో 25 సబ్‌స్టేషన్లను ప్రతిపాదించింది. వీటిలో 30 ఔట్‌డోర్ సబ్‌స్టేషన్లు, 22 ఇన్‌డోర్ సబ్‌స్టేషన్లను నిర్మిస్తుంది.
పదేళ్లలో 1200 మెగావాట్ల వ్యత్యాసం..
ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ మంచినీటి సరఫరా కోసం బోరు మోటర్, కనీసం నాలుగు లైట్లు, రెండు ఫ్యాన్లు, మిక్సీ, టీవీ, కంప్యూటర్, ఐరన్‌బాక్స్, వాటర్ హీటర్‌తో పాటు కూలర్, ఏసీ సర్వసాధారణం కావడంతో గృహ విద్యుత్ డిమాండ్ రెట్టింపైంది. సరిగ్గా పదేళ్ల క్రితం 24.12 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం 40 లక్షలు దాటింది. అప్పట్లో 1,538 మెగావాట్లు ఉన్న డిమాండ్ ప్రస్తుతం 2500-270 0 మెగావాట్లకు చేరింది. డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా వ్యవస్థ మాత్రం మెరుగుపడ లేదు. మండుతున్న ఎండలకు తోడు ఓవర్ లోడు వల్ల ఫీడర్లలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తి, విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. డీపీఏఆర్‌పీ ప్రాజెక్ట్ కింద ఇటీవ ల 64 సబ్‌స్టేషన్లు నిర్మించినా సిటీజన్ల అవసరాలు తీర్చలేకపోతున్నాయి. దీంతో కొత్తగా మరో 52 సబ్‌స్టేషన్లు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు.
ప్రతిపాదిత ప్రాంతాలు ఇవే..
కోర్‌సిటీలో తీగలగూడ, మాదన్నపేట, అజీజ్‌బాగ్, దేవీబాగ్, ఛత్రినాక, అరుంధతికాలనీ, మూసారంబాగ్, పల్లెచెరువు, గ్రీన్‌బీచ్ అకాడమీ, హనుమాన్‌నగర్, సాహెబ్‌నగర్ కాలనీ, ప్రగతినగర్, పేట్లబషీర్‌బాగ్, జీడిమెట్ల పారిశ్రామికవాడ, దత్తాత్రేయనగర్, ఆస్మాన్‌ఘడ్, యాకుత్‌పుర, ప్రశాంత్‌నగర్‌రోడ్, మూసారంబాగ్ బి బ్లాక్, జమిస్థాన్‌పుర్, అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్(2), గుడిమల్కాపుర్, ఆసిఫ్‌నగర్, మల్కజ్‌గిరిలో 33/11 కేవీ సబ్‌స్టేషన్లు నిర్మించనున్నారు.
రంగారెడ్డి అర్బన్‌లో పర్వతపుర్, బోడుప్పల్, నాగారం, అంకిరెడ్డిపల్లి, రాందాసుపల్లి, జల్‌పల్, బండరావిలాల, హన్‌మగల్, హయత్‌నగర్, ఆది బట్ల, గౌరెల్లి, తాడిపత్రి, మున్నూరు, శామీర్‌పేట్, బోడుపల్లి, చిలుకూరు, చించెల్‌పేట్, మూమెన్‌కలాన్, కల్‌కోడ్, రావిర్యాల, వట్టినాగులపల్లి, థరూర్, చేవెళ్ల, ఎల్జీఎంపేట్‌లో కొత్త సబ్‌స్టేషన్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో కొన్ని సబ్‌స్టేషన్లకు ఇప్పటికే శంకుస్థాపనలు కూడా చేయడం కొసమెరుపు.