శిథిల రాజసం.. రాచకొండ! | 700 years old history was undermined | Sakshi
Sakshi News home page

శిథిల రాజసం.. రాచకొండ!

Published Mon, Sep 4 2017 1:23 AM | Last Updated on Sun, Sep 17 2017 6:20 PM

శిథిల రాజసం.. రాచకొండ!

శిథిల రాజసం.. రాచకొండ!

- మరుగున పడుతున్న 700 ఏళ్ల చరిత్ర 
రాచకొండ దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌ 
 
ఎత్తయిన కొండలు.. పైన శత్రు దుర్భేద్యమైన కోట.. ముఖ ద్వారాలు, ఈత కొలనులు, మంచినీటి బావులు, ప్రార్థన మందిరాలు.. కనుచూపుమేర రాజ్యం. దేవాలయాలు, నాట్యశాలలు, పురోహితులు, ప్రజల ఆవాస ప్రాంతాలు, దట్టమైన అడవి.. ‘మాహిష్మతి’ని తలపించే రాచకొండ ఠీవికి నిదర్శనాలివి. 700 ఏళ్ల నాటి చారిత్రక అద్భుత ఆనవాళ్లు అవి. తెలంగాణ కీర్తిని దశదిశలా వ్యాప్తింపజేసిన పద్మనాయక వంశ (వెలమ) రాజులు.. సుమారు 150 దేవాలయాలను నిర్మించారు. ప్రకృతి వైపరీత్యాలు, గుప్త నిధుల కోసం జరిపిన తవ్వకాలతో కళ తప్పినా.. ఆ ‘రాజ’దర్పం మాత్రం చెక్కు చెదరలేదు. శిథిలమవుతున్న ఘన చరిత్రకు నిదర్శనంగా రాచకొండ నిలుస్తోంది. హైదరాబాద్‌కు సమీపంలోని రాచకొండ చరిత్రపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌. 
– బొల్లం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి, నల్లగొండ
 
35 వేల ఎకరాల విస్తీర్ణం
రాచకొండ విస్తీర్ణం.. సుమారు 35 వేల ఎకరాలు. ప్రస్తుత యాదాద్రి జిల్లాలో ఉన్న సంస్థాన్‌ నారాయణపురం మండలం పరిధిలో 14,760 ఎకరాలు. చౌటుప్పల్‌, రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలంలో మిగతా ప్రాంతం విస్తరించి ఉంది. ఇక్కడ 4 వేలకు పైగా నెమళ్లు ఉన్నాయి. నక్షత్ర తాబేళ్లకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. విలువైన కలపను గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్, ఇబ్రహీంపట్నానికి తరలిస్తున్నారు. ఒకప్పుడు కీకారణ్యంలా ఉన్న ఈ ప్రాంతం చెట్ల నరికివేతతో మైదానంగా మారుతోంది.
 
ఫిలిం సిటీగా కోట
2014 డిసెంబర్‌ 15న రాచకొండ గుట్టలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. రాచకొండను ఫిలిం సిటీగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర చిత్ర పరిశ్రమకు రానున్న రోజుల్లో పెద్ద దిక్కవుతుందని పేర్కొన్నారు. 2 వేల ఎకరాల్లో íఫిలిం సిటీ, విద్యాసంస్థలు, క్రీడా ప్రాంగణాలను కోటకు సమీపంలో ఏర్పాటు చేయిస్తామన్నారు. అయితే మూడేళ్లవుతున్నా అలనాటి రాచరిక ఆనవాళ్లను కాపాడేందుకు, అభివృద్ధి చేసేందుకు బీజం పడలేదు. కోటను íఫిలిం సిటీగా అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా విరాజిల్లే అవకాశం ఉంది. హైదరాబాద్‌ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాచకొండపై ప్రభుత్వం దృష్టి పెడితే అంతరించిపోతున్న ‘రాచ’కీర్తికి పూర్వవైభవం కల్పించినట్లు అవుతుంది.
 
చారిత్రక నేపథ్యం ఇదీ..
కాకతీయుల పతనానంతరం పద్మనాయకులు రాచకొండ ప్రాంతంలో స్వతంత్ర రాజ్యం స్థాపించారు. రాచకొండ గ్రామానికి సమీపంలో కోటను నిర్మించారు. క్రీ.శ 1325–1475 మధ్య పద్మనాయక వంశీయుల పాలన సాగింది. రాచకొండ, దేవరకొండ దుర్గాలను వీరే నిర్మించారు. రాచకొండ దుర్గాన్ని అనపోతనేడు అనే రాజు కాలంలో నిర్మించారు. ఎర్ర దాచ నాయుడితో ప్రారంభమైన వీరి పాలన సర్వజ్ఞరావు సింగభూపాలుడితో ముగిసింది. తర్వాత ఈ వంశీయులు విజయనగర రాజ్యంలో సామంతులుగా ఉండడం, అనంతరం బహుమనీల రాజ్య విస్తరణతో వారి ఏలుబడిలోకి వెళ్లింది.
 
7 ముఖ ద్వారాలు.. మంచినీటి బావులు..
ప్రధాన కోటకు కింద నుంచి పైకి 7 ముఖ ద్వారాలున్నాయి. ద్వారాలన్నీ శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. అయితే కోట అంతా నామరూపాలు లేకుండా పోయింది. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి నాశనం చేశారు. కొండపైన ఉన్న ప్రత్యేక ప్రార్థన మందిరం మాత్రమే రాజదర్పానికి ఆనవాలుగా ఉంది. కొండపైన 2 ఈత కొలనులు పెద్దపెద్ద బండలను తొలిచి నిర్మించారు. లోతైన మంచినీటి బావులు ఉన్నాయి. ఇక్కడి సంకెళ్ల బావికి ఓ ప్రత్యేకత ఉంది. పట్టుబడిన దొంగలకు సంకేళ్లు వేసి నీళ్లు తోడించావారట. సుమారు 300 చెరువులు, కుంటలు ఉన్నాయి. పెద్ద చెరువుల వద్ద ప్రత్యేకంగా శాసనాలు వేయించారు. అన్నపోత, నాగసంద్రం, దేవ, రాయ చెరువులు ఇక్కడ ప్రధానమైనవి. గొలసుకట్టుతో ఉన్న ఈ చెరువులు చాలా వరకు శిథిలావస్థకు చేరాయి.
 
కళాపోషకులు..: రాచకొండ రాజులు కళలకు ప్రాధాన్య మిచ్చారు. తెలుగు కావ్యత్రయంలోని ముఖ్యమైన రెండు కావ్యాలు రామాయణం, మహాభారతం ఇక్కడి నుంచే వెలువడ్డాయి. కొండ కింద కళామందిరాలు నిర్మించారు. వందల ఏళ్లయినా ఈ కళామందిర గోడలపై ఇప్పటికీ కళారూపాలు కనిపిస్తున్నాయి. పర్యావరణం కలుషితంతో ఇవి రానురాను శిథిలమవుతు న్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. 
 
100కు పైగా శివాలయాలు..
రాచకొండలో 150 ఆలయాలుండగా.. అందులో 100కు పైగా శివాలయాలే. సూర్య కిరణాలు శివలింగంపై పడేలా ఆలయాలు నిర్మిం చారు. కొండ చుట్టూ  దారి వెంట వినాయక ప్రతిమలు చెక్కించారు. చౌటుప్పల్‌ సమీపంలో జాతీయ రహదారిపై కొయ్యలగూడెం నుంచి రాచకొండకు వెళ్లే దారిలో కొండకింద ప్రధాన శివాలయం ఉంది. కోటకు అభిముఖంగా ఉన్న ఈ ఆలయానికి వచ్చి రాజులు పూజలు చేసేవారు. కోటకు వెళ్లే ప్రధాన ముఖద్వారం సమీపంలోనే రాముడిని ప్రతిష్టించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement