
గ్రేటర్ బరిలో ఆర్యవైశ్యులు
ఖైరతాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్యవైశ్యులు ముందుకురావాలని, సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయాల్లో రాణించాల్సిన అవసరం ఉందని ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రసిడెంట్ గంజిరాజమౌళిగుప్త అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివిధ పార్టీలలో పనిచేస్తున్న, పోటీచేయాలనే కోరిక ఉన్నవారు తమ బయోడేటాలతో లక్డీకాపూల్‌లోని వాసవీ హాస్పిటల్‌లో మంగళవారం సాయంత్రం 5గంటలకు నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని కోరారు.
ఔత్సాహికుల నుంచి సేకరించిన బయోడేటాలతో ఆయా పార్టీల తరపున సీటు ఇప్పించడంతో పాటు వారిని గెలిపించేందుకు వైశ్ ఫెడరేషన్ కృషిచేస్తుందన్నారు. నగరంలోని సరూర్‌నగర్, రామకృష్ణాపురం, కొత్తపేట, సీతాఫల్‌మండి, వారాసిగూడ, గన్‌ఫౌండ్రి, నాగోల్, మౌలాలి, నాచారం, జాంబాగ్, అంబర్‌పేట్, మూసారాంబాగ్, రామాంతపూర్, హబ్సీగూడ,బాల్‌నగర్, ఖార్కాణా తదితరప్రాంతాల్లో వైశ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఆయా పార్టీల తరపున సీటు కేటాయిస్తే గెలిచి చూపిస్తామన్నారు.
సమావేశంలో ఐవీఎఫ్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ముత్యాల సత్యయ్య, పొలిటికల్ కమిటి చైర్మన్ నాగబండి ఆనంద్, హైదరాబాద్ అధ్యక్షుడు మాడిశెట్టి సదానందం, సికింద్రాబాద్ అధ్యక్షుడు సత్యనారాయణతో పాటు బూరుగుల లలిత, గౌరిశెట్టి ప్రభాకర్, మహిళా అధ్యక్షురాలు మలిపెద్ది మేఘమాల పాల్గొంటారన్నారు.