కోటి మందికి ‘అభయ హస్తం’
► ఎస్‌హెచ్‌జీ మహిళలతో పాటు వారి భర్తలకూ వర్తింపు
► కొత్త ‘అభయ హస్తం’పై కొలిక్కి వచ్చిన కసరత్తు..
► సీఎం ఆమోదమే తరువాయి
సాక్షి, హైదరాబాద్: మహిళలకు సాధికారత కల్పించాలనే ఉద్దేశంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి (2009లో) ప్రవేశపెట్టిన ‘అభయ హస్తం’పథకాన్ని ఇకపైనా కొనసాగించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. అయితే.. మరింతమందిని ఈ పథకం పరిధిలోకి తీసుకు రావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని మార్పులను సూచించింది. గత 3 నెలలుగా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కొత్త మోడల్ రూపకల్పనపై చేస్తున్న కసరత్తు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. దాదాపు రూ. కోటీ పది లక్షలమందికి అభయ హస్తం పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా అదనంగా మరో రూ.160 కోట్ల భారం పడనుందని అంచనా. కొత్త మోడల్‌కు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో, ఫైలు ఆర్థిక శాఖకు వెళ్లింది. ఆపై ముఖ్యమంత్రి ఆమోదించిన వెంటనే కొత్త మోడల్ ‘అభయహస్తం’ను అమల్లోకి తీసుకు రానున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అభయ హస్తం తాజా మోడల్ ఇలా..!
► స్వయం సహాయక గ్రూపులోని పేద మహిళలకు అభయ హస్తం పథకం ద్వారా పలు రకాలుగా లబ్ధి చేకూరనుంది. 18 ఏళ్లు పైబడిన మహిళలు ఈ పథకంలో సభ్యురాలిగా చేరవచ్చు. గతంలో 59 ఏళ్లున్న గరిష్ట వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచనున్నారు.
► ప్రస్తుతం అభయహస్తం పథకంలో 20.15 లక్షల మంది సభ్యత్వం పొందగా.. కొత్త మోడల్‌లో 60 లక్షల మంది మహిళలకు సభ్యత్వం ఇవ్వనున్నారు. వారికి, వారి జీవిత భాగస్వాములు సుమారు 50 లక్షలమందికి బీమా సదుపాయం కల్పించనున్నారు.
► ఈ పథకంలో చేరిన సభ్యులు రోజుకు రూపాయి చొప్పున(ఏడాదికి రూ.365) కార్పస్ ఫండ్ చెల్లిస్తే గతంలో రూ.3లక్షల ప్రమాదబీమా, రూ.75వేల జీవిత బీమా లభించేది. అయితే.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం రూ.12తో బీమా సదుపాయం లభిస్తోంది. ఎస్‌హెజ్‌జీ సభ్యురాలితో పాటు ఆమె జీవిత భాగస్వామికీ ఈ ప్రీమియంను సర్కారే చెల్లించనుంది.
► గతంలో సభ్యురాలిది సహజ మరణమైతే ప్రమాద బీమా మొత్తం రూ.30 వేలు కాగా.. ప్రస్తుతం అది రూ.2.30 లక్షలు కానుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే గతంలో రూ.75వేల బీమా ఉండగా.. ఇప్పుడు 4.75 లక్షలు చెల్లిస్తారు. పాక్షిక అంగవైకల్యం జరిగితే రూ.1.37 లక్షలు, శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.2.75 లక్షలు చెల్లిస్తారు.
► సాధారణ బీమా ప్రయోజనం 60 ఏళ్లదాకా, ప్రమాద బీమా సదుపాయం 70 ఏళ్ల వరకు వర్తిస్తుంది. జీవిత భాగస్వామి చనిపోయినా, శాశ్వత అంగవైకల్యం సంభవించినా రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.లక్ష బీమా మొత్తం లభిస్తుంది.
► గతంలో 50 ఏళ్ల వరకే కార్పస్ ఫండ్ కంట్రిబ్యూషన్ తీసుకొని 60 ఏళ్ల నుంచి జీవితాంతం అభయహస్తం పెన్షన్ (రూ.500)ను కొనసాగించేవారు. అయితే.. ప్రస్తుతం 65 ఏళ్ల వరకు కార్పస్ ఫండ్ కంట్రిబ్యూషన్ స్వీకరించి, ఆపై అర్హులైన వారికి ఆసరా పింఛన్‌ను వర్తింప చేయనున్నారు.
► కొత్త మోడల్ ద్వారా కార్పస్ ఫండ్‌కు సభ్యురాలు చెల్లించిన మొత్తంతో పాటు ప్రభుత్వం కూడా దాదాపు అంతే మొత్తం జమ చేయనుంది. 65 ఏళ్ల తర్వాత జీవించి ఉన్న సభ్యురాలికి ఈ మొత్తాన్ని ఎల్‌ఐసీ అందించే వడ్డీతో సహా చెల్లించనున్నారు. గతంలో సభ్యురాలు మరణిస్తేనే నామినీకి ఆ మొత్తాన్ని అందజేసేవారు.
► గతంలోలానే సభ్యురాలి ఇద్దరు పిల్లలకు ఏడాదికి రూ.1,200 చొప్పున నాలుగేళ్ల పాటు (9 నుంచి 12వ తరగతి వరకు) ఎల్‌ఐసీ నుంచి ఉపకారవేతనం ఇకపైనా లభించనుంది.