సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు
- నల్లగొండ మినహా రాష్ట్రవ్యాప్తంగా సోదాలు
- పెండింగ్‌లో ఉన్న 5 వేల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు స్వాధీనం
- ప్రభుత్వం సమాచారమివ్వడంతో సర్దుకున్న సబ్ రిజిస్ట్రార్లు
సాక్షి, హైదరాబాద్, నెట్‌వర్క్: మియాపూర్ భూకుంభకోణం నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)రంగంలోకి దిగింది. అనుమానిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించింది. పాత జిల్లాల ప్రకారంనల్లగొండ మినహా ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్‌లో దాడులు చేసినట్టు ఏసీబీ అధికారులు తెలి పారు. జిల్లా రిజిస్ట్రార్, డీఐజీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ తమ బృందాలు దాడులు చేశాయని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకుపైగా రిజిస్ట్రేషన్ కోసం పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
అయితే, వీటిలో ప్రభుత్వ భూములకు సంబంధించిన పెండింగ్ రిజిస్ట్రేషన్‌లున్నాయా? లేవా అన్న అంశంపై నివేదిక రూపొందిస్తామని, అర్ధరాత్రి వరకు కూడా తమ బృందాలు దాడులు నిర్వహిస్తూనే ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ముందస్తుగానే ఏసీబీ, స్పెషల్ స్క్వాడ్‌ల దాడుల సమాచారం ఇవ్వడంతో సబ్ రిజిస్ట్రార్లు అప్రమత్తమై పెండింగ్, ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎంటర్‌చేయని డాక్యుమెంట్లను మాయం చేశారని ఏసీబీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు సబ్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ల ఇళ్లు, బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు చెప్పారు.
రిజిస్ట్రేషన్ పూర్తయినా కార్యాలయంలోనే దస్త్రాలు...
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రిజిస్ట్రేషన్ పూర్తయినా కార్యాలయంలోనే దస్త్రాలు ఉండడంపై సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. గత నాలుగేళ్ల ఇంటర్నల్ ఆడిట్ నివేదిక కనపడకపోవడంపై ప్రశ్నించగా సస్పెన్షన్‌కు గురైన సబ్ రిజిస్ట్రార్ పాపయ్య తీసుకెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. హైదరాబాద్ ఎల్‌బీ నగర్ పరిధిలోని నాగోలు కో–ఆపరేటివ్ బ్యాంక్ కాలనీలో ఉన్న మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేశ్‌చంద్రారెడ్డి ఇంటి నుంచి కిలో బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు, ఇతర విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రమేశ్‌చంద్రారెడ్డి ఎల్‌బీ నగర్‌లో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసినప్పుడు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారంటూ రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ పద్మారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్‌బీ నగర్ పోలీసులు మంగళవారం ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.