ప్రేమించలేదని యువతిపై యాసిడ్ దాడి
- కొంతకాలంగా యువతి వెంట పడుతున్న ప్రదీప్
- మాట్లాడాలంటూ ఇంట్లోంచి బయటికి పిలిచి దాడి
- ముఖంపై యాసిడ్ చల్లి పరారీ.. 40% కాలిన గాయాలు
- కుత్బుల్లాపూర్‌లో ఘటన
హైదరాబాద్: తాను ఎంతగా వెంటపడుతున్నా ప్రేమించడం లేదనే ఉన్మాదంతో ఓ యువతిపై ప్రదీప్ అనే యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. మాట్లాడాలంటూ ఇంట్లోంచి బయటికి పిలిచి.. ముఖంపై యాసిడ్ చల్లి పరారయ్యాడు. హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. కుత్బుల్లాపూర్‌లోని దత్తత్రేయనగర్‌లో నివసించే ఖబీరా బేగం (17) సుభాష్‌నగర్‌లోని ఓ ఫ్యాన్ల కంపెనీలో పనిచేస్తోంది. షాపూర్‌నగర్ కళావతినగర్‌కు చెందిన ప్రదీప్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడుతున్నాడు. ఇందుకు ఖబీరా ససేమిరా అనడంతో కక్ష పెంచుకున్నాడు.
సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె ఇంటికి వద్దకు వచ్చాడు. ఏదో మాట్లాడాలంటూ ఫోన్ చేసి ఇంటి బయటికి రమ్మన్నాడు. ఆమె బయటికి రాగానే.. తన వెంట తెచ్చిన యాసిడ్‌ను ఖబీరాబేగం ముఖంపై చల్లి పరారయ్యాడు. దీనిపై స్థానికులు సమాచారమివ్వడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 40% కాలినగాయాలైన బాధితురాలిని సురారం మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ప్రదీప్‌ను పట్టుకునేం దుకు 4 బృందాలతో గాలింపు చేపట్టారు. అతడి ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.