సాక్షి, హైదరాబాద్: ప్రముఖ యాంకర్ ప్రదీప్ సోమవారం పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. గంటకుపైగా ప్రదీప్ కౌన్సెలింగ్ కొనసాగింది. అనంతరం ప్రదీప్ మీడియాతో మాట్లాడారు. పోలీసులు ఇచ్చిన తేదీ ప్రకారమే తాను కౌన్సెలింగ్‌కు హాజరయ్యానని, తాను కౌన్సెలింగ్‌కు రాకపోవడం ఏమీలేదని ప్రదీప్ తెలిపారు. ఈ విషయంలో చట్టప్రకారంగా నిబంధనలన్నింటినీ అనుసరించినట్టు తెలిపారు.
‘పోలీసుల కౌన్సెలింగ్‌లో చాలా విషయాలు తెలుసుకున్నాను. కౌన్సెలింగ్ చాలా కీలకమైంది. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయన్నది, తాగి నడపడం వల్ల శరరీంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఎందుకు తాగి నడపకూడదు అన్నది కౌన్సెలింగ్‌లో చాలా క్లారిటీగా వివరించారు. ఈ విషయాలను నాకు తోచినంత వరకు మిగతావారికి చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ఈ విషయంలో నాకు సహకరించిన ట్రాఫిక్ పోలీసులు, మీడియా, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు అందరికీ ధన్యవాదాలు’ అని ప్రదీప్ అన్నారు. ’ నేను చేసింది దయచేసి ఇంకెవరూ చేయకండి’ అని ఆయన ప్రజలను కోరారు.
గత నెల 31వ తేదీ అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన యాంకర్ ప్రదీప్ సోమవారం గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ప్రదీప్ గతకొన్ని రోజులుగా పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరుకాని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రదీప్ వస్తాడా? రాడా? అన్నది తెలియక పోలీసులు సైతం అయోమయంలో మునిగిపోయిన తరుణంలో ఎట్టకేలకు ట్రాఫిక్ పోలీసుల ముందు ప్రదీప్ హాజరయ్యాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలు వివరించడంతోపాటు.. మరోసారి తాగి వాహనం నడుపవద్దంటూ ప్రదీప్‌కు పోలీసుల సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తండ్రితో కలిసి ప్రదీప్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు. వాహనం నడుపుతున్న సమయంలో ఏరకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కుటుంబసభ్యులకు పోలీసులు వివరించనున్నారు.
బేగంపేటకు వస్తానని.. గోషామహల్‌కు..!
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిపోయిన ప్రదీప్ వ్యవహారశైలి ఇన్నాళ్లు అంతుపట్టనిరీతిలో ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం బేగంపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ప్రదీప్ కౌన్సెలింగ్‌కు హాజరవుతారని భావించారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ చౌహాన్‌కు ప్రదీప్ సమాచారం కూడా అందించారు. కానీ ప్రదీప్ అనూహ్యంగా గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.
డిసెంబర్ 31న అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రదీప్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోవడంతో పోలీసులు కేపీహెచ్‌బీలోని ఆయన కార్యాలయంతోపాటు మణికొండలోని నివాసంలో నోటీసులు అందించేందుకు ప్రయత్నించారు. అయితే, అతను అందుబాటులో లేకపోవడంతో వెనక్కి వచ్చారు. దీంతో ప్రదీప్ పరారీలో ఉన్నట్లు ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. ఇది తెలుసుకున్న ప్రదీప్ గత శుక్రవారం వీడియో ద్వారా తాను త్వరలోనే కౌన్సెలింగ్‌కు హాజరుకాబోతున్నట్లు తెలిపారు.
నిబంధనల ప్రకారం తల్లి లేదా భార్యను కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సి ఉంటుంది. పెళ్లి కాలేదు కాబట్టి తల్లిని తీసుకొని రావాలని నిబంధనలను పోలీసులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా కారు అద్దాలకు బ్లాక్‌ఫిలిం ఏర్పాటు చేసుకున్న ఘటనలోనూ ప్రదీప్‌పై పోలీసులు జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment