హైదరాబాద్ లోని అగాఖాన్ అకాడమీలో విద్యార్థులతో ముచ్చటిస్తున్న'పద్మవిభూషణ్' అగాఖాన్
ప్రముఖ వ్యాపారవేత్త, సమాజ సేవకుడు, 'పద్మవిభూషణ్' అగాఖాన్ శుక్రవారం హైదరాబాద్ లోని అగాఖాన్ అకాడమీని సందర్శించారు.పద్మ పురస్కారం స్వీకరించేందుకు భారత్ వచ్చిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ సమీపంలోని అగాఖాన్ అకాడమీకి వచ్చారు. షియా ఇస్లామ్‌కు సంబంధించిన నిజారి ఇస్లామిజమ్‌కు 49వ ఇమామ్‌గా వ్యహరిస్తున్న అగాఖాన్ దాదాపు రెండేళ్ల తర్వాత హైదరాబాద్ రావడంతో అకాడమీ ప్రతినిధులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వైజ్ఞానిక ప్రదర్శనలో పలువురు విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఉత్తమ ఐడియాతో ప్రాజెక్టును రూపొందించిన విద్యార్థులను అగాఖాన్ అభినందించారు.
అగాఖాన్.. ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌ల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వాటిలో హోటళ్ల వ్యాపారం ప్రధానమైనది. ఫోర్బ్స్ పత్రిక ప్రకారం 80 కోట్ల డాలర్ల సంపద కలిగిన ఆయన.. ఆఫ్రికా, ఆసియా, పశ్చిమాసియాల్లో విద్యావ్యాప్తితోపాటు ధార్మిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సమీపంలో దాదాపు 100 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన అగాఖాన్ అకాడమీలో మత, ప్రాంతీయ బేధాలకు తావులేంకుడా వందలాదిమంది విద్యార్థులకు బోధనతోపాటు వసతి సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు.