ప్లాస్టిక్‌పై మళ్లీ నిషేధం
ఇక 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్
క్యారీ బ్యాగ్‌ల వాడకం కుదరదు
ఆగస్టు 1 నుంచి అమలు
గతానుభవాల దృష్టా ‘బ్యాన్’పై అనుమానాలు
పకడ్బందీగా అమలు: మేయర్
సిటీబ్యూరో: గ్రేటర్‌లో పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్‌పై జీహెచ్‌ఎంసీ నిషేధం విధించింది. ఆగస్టు 1 నుంచి 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ కవర్ల వాడకం కుదరదని సృష్టం చేసింది. హైదరాబాద్‌ను ధ్వంసం చేసే ఏ విషయాన్నీ ఉపేక్షించబోమని, అవసరమైతే ప్రత్యేక చర్యలు చేపట్టి నగరంలో ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని మేయర్, కమిషనర్‌లు స్పష్టం చేశారు. కాగా ప్లాస్టిక్ నిషేధం నగరంలో ప్రహసనంగా మారిందనే చెప్పొచ్చు. గతంలోనూ నిషేధం విధించినా అమలులో సాధ్యంకాలేదు. నిషేధం పకడ్బందీగా అమలు చేసేందుకు నియమించిన ఎన్‌ఫోర్సుమెంటూ ఏమీ చేయలేకపోయింది. దీంతో గత అనుభవం ఉన్న నగర ప్రజలు మాత్రం ప్లాస్టిక్ నిషేధం అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో కార్తీకరెడ్డి మేయర్‌గా ఉన్నప్పుడు తొలుత పూర్తిగా ప్లాస్టిక్‌ను నిషేధిస్తామన్నారు. అనంతరం ఒక మెట్టు దిగి 40 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై నిషేధం విధించారు.
ఆరంభంలో పకడ్బందీగా నిషేధం అమలు చేసినప్పటికీ చివరకు మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. ఈ పరిశ్రమపై ఆధారపడ్డ పేదల కుటుం బాలు రోడ్డున పడతాయనే సాకుతో నిషేధాన్ని నీరు గార్చారు. ఈ వ్యవహారంలో అప్పట్లో కొందరు నేతలకు భారీ ముడుపులు ముట్టినట్లు ఆరోపణలొచ్చాయి. నిర్ణీత మైక్రాన్ల ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల సాకుతో దుకాణదారులు అప్పటినుంచే క్యారీ బ్యాగులకు సైతం ప్రజల నుంచి సొమ్ము వసూలు చేయడం ఆరంభించారు. 40 మైక్రాన్లున్నా, లేకున్నా జనం నుంచి మాత్రం సొమ్ము వసూలు చేస్తున్నారు. ఇలా ఏటా రూ. 5 కోట్లు ప్రజల నుంచి వ్యాపారులు దండుకుంటున్నారు.
ప్రహసనంగా..
అప్పట్లో చేసిన ప్రకటనలన్నీ పరిహాసంగా మిగిలాయి. ఉల్లంఘనులకు జరిమానాలు నామ్‌కేవాస్తేగా మారాయి. సంస్థల మూసివేతలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఉత్పత్తిదారుల టాస్క్‌ఫోర్స్‌లు ఉత్తుత్తి మాటలయ్యాయి. అధికారుల ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫార్సుగా మారింది. ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్‌రూం, కాల్‌సెంటర్ కబుర్లుగానే మారాయి. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా జ్యూట్ బ్యాగుల తయారీలో మహిళలకు శిక్షణ కార్యక్రమాలిస్తామన్న మాటలు సమావేశాలకే పరిమితమయ్యాయి. ఉల్లంఘనలకు పాల్పడే వ్యాపార సంస్థలు సీజ్ చేస్తామనే హెచ్చరికలు అమలు కాలేదు.
పని చేయని ఎన్‌ఫోర్స్‌మెంట్..
నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు డిప్యూటీ మునిసిపల్ కమిషనర్లను చీఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లుగా నియమించారు. ఏఎంఓహెచ్‌లను అడిషనల్ చీఫ్‌ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లుగా, ఏఎల్‌ఓలు, ఎల్‌ఐఎస్, ఎల్‌ఎస్‌ఐ, శానిటరీ సూపర్‌వైజర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులుగా నియమించారు. అవసరాన్ని బట్టి చీఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లు పోలీసులు, విజిలెన్స్ విభాగాల సహకారంతో పనిచేయాలని నిర్ణయించారు. తొలుత పనిచే సిన ఈ కమిటీలు అనంతరం తమ పని మరచిపోయాయి. క్రమేపీ 40 మైక్రాన్ల లోపు వినియోగం మళ్లీ పెరిగిపోయింది. ప్రజలపై కవర్లకు పడ్డ భారం మాత్రం ఆగలేదు.
పకడ్బందీగా అమలు చేస్తాం: మేయర్
గ్రేటర్ నగరంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ కవర్లపై నిషేధం విధించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. ఇందుకోసం శుక్రవారం నగరంలోని ప్లాస్టిక్ ఉత్పత్తిదారులు, ట్రేడర్లు, హోటల్స్, మాల్స్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పర్యావరణానికి పెనుముప్పుగా మారిన తక్కువ మైక్రాన్ల ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల వినియోగాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదన్నారు. అవసరమైతే జీహెచ్‌ఎంసీ నిబంధనలు, చట్టాలు మార్చి అయినా సరే పకడ్బందీగా ఈ నిషేధాన్ని అమలు చేస్తామన్నారు. ఇందుకు వ్యాపారులు సహకరించాలని కోరారు. హైదరాబాద్‌ను ధ్వంసం చేసే ఏ అంశాన్నీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. బిర్యానీ ప్యాకింగ్‌లకు వినియోగించే సిల్వర్ కవర్లు, షాంపూ ప్యాకెట్లు, చిరు ఆహారాల ప్యాకెట్లతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. గతంలో 40 మైక్రాన్లలోపు నిషేధాన్ని కేంద్రం ఇటీవల 50 మైక్రాన్లలోపు వరకు పెంచిందని తెలిపారు. నగరంలోని వ్యర్థాల్లో 70 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే కావడంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయని, చిరువ్యాపారులకు అవగాహన కల్పించాల్సిందిగా డిప్యూటీ కమిషనర్లను ఆదేశించినట్లు తెలిపారు. నిషేధం అమలుకు సర్కిళ్ల వారీగా మానిటరింగ్ కమిటీలను నియమిస్తామని కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు.