రాహుల్.. ఓయూకు రండి
ఏఐసీసీ ఉపాధ్యక్షుడిని కలసి ఓయూ జేఏసీ విన్నపం
సాక్షి, న్యూఢిల్లీ: ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే తెలంగాణ ఆత్మగౌరవ సభకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఓయూ జేఏసీ నేతలు ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం వారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఢిల్లీలో రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ వచ్చినా ప్రజలు సంతృప్తిగా లేరని, ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదని చెప్పారు.
తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని వివరించారు. ఈ ప్రతిని ధి బృందంలో వివిధ విద్యార్థి సంఘాల నేతలు కైలాష్ నేత, దరువు ఎల్లన్న, మానవతారాయ్, విజయ్‌కుమార్, చరణ్, నాగెల్లి వెంక టేష్‌గౌడ్, లోకేష్‌యాదవ్ తదితరులు ఉన్నారు. తమ ఆహ్వానానికి రాహుల్‌గాంధీ సానుకూలంగా స్పందించినట్లు జేఏసీ నేతలు తెలిపారు.
ఆయనొస్తున్నారనే...
రాహుల్‌గాంధీ హైదరాబాద్‌కు వస్తున్నారనే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘ఓయూ, కేయూ, తెలంగాణ యూనివర్సిటీలకు వీసీలు లేరు. సిబ్బంది సరిపడాలేరు. విద్యార్థులు నిరాశలో ఉన్నారు. రాహుల్ ఇక్కడికి వస్తున్నారంటేనే ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పందిస్తోంది.
ఆయన రాక విద్యార్థులకు, యువతకు మేలు జరుగుతుందని మేం భావిస్తున్నాం.’ అని ఉత్తమ్ అన్నారు. రాష్ట్రంలో లక్షా 50 వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని, బోధన ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ 27న హైదరాబాద్, 28న వరంగల్‌లో పర్యటిస్తారని, వరంగల్‌లో బొగ్గు గని కార్మికులతో మాట్లాడతారని వివరించారు.