హనుమాన్ ర్యాలీకి పకడ్బందీ ఏర్పాట్లు
– 250మంది పోలీసులతో బందోబస్తు
హిమాయత్‌నగర్: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నిర్వహించే హనుమాన్ ర్యాలీకి పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సుమారు 250మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తును నిర్వహిస్తున్నట్లు అబిడ్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జె.రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. నారాయణగూడలోని ఓ ఫంక్షన్ హాలులో నారాయణగూడ, అబిడ్స్, బేగంబజార్ పోలీస్ స్టేషన్‌ల ఇన్‌స్పెక్టర్‌లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లతో సమావేశాన్ని సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాఘవేందర్‌రెడ్డి మాట్లాడుతూ హనుమాన్ ర్యాలీ గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమై సూల్తాన్‌బజార్ పీఎస్ మీదుగా అబిడ్స్, నారాయణగూడ పీఎస్‌ల పరిధిలోకి వస్తుందన్నారు. అబిడ్స్, నారాయణగూడ, బేగంబజార్ పీఎస్ పరిధిలో ఉన్న మసీదులు, మదర్సా, చిల్లాల్‌ల వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి మీదుగా ర్యాలీ వెళ్తున్నప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. చిల్లాల్ వద్ద కుంకుమ చల్లే అవకాశాలు ఉండటం వల్ల అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. యువకులు ద్విచక్రవాహనాలపై ర్యాలీగా కట్టెలతో వస్తారని, వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. సమావేశంలో నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ బండారి రవీందర్, క్రైమ్ ఇన్‌స్పెక్టర్ గవిడి రాంబాబు, ఇన్‌స్పెక్టర్లు గంగారాం, మోహన్, లక్ష్మణ్, ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు నాగార్జునరెడ్డి, వెంకటేశ్వర్లు, ఇమ్మానియేలు, సైదులు, కవుద్దీన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.