
ఆవిర్భావం రోజే అన్ని ఉత్తర్వులు..
♦ తుది ముసాయిదా, ఉద్యోగులకు ఆర్డర్లు
♦ దసరా రోజు ఉదయం 10గంటలకు జారీ
♦ సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు
♦ సన్నాహక చర్యలకు నిర్ణీత గడువుతో చెక్ లిస్ట్
సాక్షి, హైదరాబాద్ : కొత్త జిల్లాలకు సంబంధించిన అన్ని ఉత్తర్వులనూ వాటి ఆవిర్భావ తేదీ అయిన దసరా నాడే జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల తుది ముసాయిదాతో పాటు ఉద్యోగులకు వర్క్ ఆర్డర్లను సైతం ఆ రోజే ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబరు 11న దసరా రోజున ఉదయం 10 గంటలకు కొత్త జిల్లాలను ప్రారంభిచనుంది. కలెక్టరేట్లతో పాటు జిల్లా ఆఫీసులన్నింటికీ అదే రోజున ఉదయం బోర్డులు అమర్చి అక్కణ్నుంచే కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఆవిర్భావానికి అవసరమైన ముందస్తు సన్నాహాలపై కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
కొత్త జిల్లాల ఏర్పాటు క్రమంలో చేపట్టాల్సిన చర్యలపై నిర్ణీత కాల ప్రణాళికను విడుదల చేసింది. ఈ చెక్ లిస్ట్‌కు అనుగుణంగా కార్యకలాపాలన్నీ నిర్వహించాల్సిన బాధ్యతను కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర మెమో జారీ చేశారు. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాల కార్యకలాపాలన్నీ ఒకే రోజున ప్రారంభం కావాల్సి ఉన్నందున ఆ సన్నాహాలన్నిటినీ నిర్ణీత తేదీలోగా చేపట్టాలని ఆదేశించారు. పనులను ఆరు విభాగాలుగా వర్గీకరించుకోవాలని సూచించారు. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, కలెక్టర్, ఎస్పీల క్యాంపు ఆఫీసు, జిల్లా స్థాయి అధికారుల కార్యాలయాల ఏర్పాటుకు భవనాల గుర్తింపు ఇప్పటికే పూర్తయింది.
వాటికి సంబంధించిన అద్దె ఒప్పందాలను ఈ నెల 30వ తేదీలోగా చేసుకోవాలి. మరమ్మతులను అక్టోబరు 1 నాటికి పూర్తి చేయాలి. ఆఫీసులో ఉద్యోగులు పని ప్రారంభించేందుకు కావాల్సిన ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఆఫీస్ సీళ్లు, రబ్బర్ స్టాంపుల వంటివాటన్నింటినీ అక్టోబరు 5కల్లా సమకూర్చుకోవాలి. అక్టోబరు 11న దసరా రోజున ప్రభుత్వం నిర్ణయించిన ముహూర్తానికి ఆఫీసుల బోర్డులు అమర్చాలి. అన్ని జిల్లా విభాగాల అధికారులు అక్టోబరు 6న ప్రతిపాదిత కొత్త జిల్లాలకు వెళ్లి కొత్త కార్యాలయాలు సిద్ధంగా ఉన్నదీ లేనిదీ స్వయంగా పరిశీలించి నిర్ధారించుకోవాలి. ఆ వెంటనే వీటిపై కలెక్టర్లు సీఎస్‌కు నివేదిక పంపించాలి.
నెలాఖరులోగా వాహనాలు
వాహనాలతో పాటు కొత్త జిల్లాలకు పంపిణీ చేసేందుకు వీలయ్యే పరికరాలను ఈ నెలాఖరులోగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న ఫైళ్లను ప్రతిపాదిత కొత్త జిల్లాల వారీగా విభజించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. వాటిని వెంటనే వేర్వేరు చేసి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాఫ్ట్‌వేర్‌లో డేటా ఎంట్రీ చేయాలని, సాధారణ ఫైళ్ళ స్కానింగ్ 18లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. అత్యంత ముఖ్యమైన ఫైళ్లు తప్ప మిగతా వాటన్నింటినీ కట్టలు కట్టి ప్యాకింగ్ చేసి ఈ నెల 25 కల్లా రవాణాకు సిద్ధంగా ఉంచాలి.
దసరా రోజునే కొత్త ఖాతాలు
ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలన్నిటినీ దసరాలోగా తెరవాలని ప్రభుత్వం సూచించింది. కొత్త జిల్లాల్లో అవసరమైన డబ్బును అక్టోబరు ఒకటో తేదీలోగా అందుబాటులో ఉంచాలంది. 5వ తేదీలోగా స్టేషనరీ, బోర్డులు పరిపాలనకు అవసరమైనవన్నీ సిద్ధంగా ఉండాలని నిర్దేశించింది.
ఉద్యోగుల డేటా నేటితో పూర్తి
అన్ని శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలన్నీ సీజీజీ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను 15వ తేదీకల్లా పూర్తి చేయాలని కోరింది. దసరా నాడు ఉద్యోగులు తమకు నిర్దేశించిన జిల్లాలో పని చేసేందుకు సిద్ధంగా ఉంచాలని సూచించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేదాకా ఉద్యోగుల సర్వీసు రికార్డులన్నిటినీ ప్రస్తుతమున్న జిల్లాల్లోనే ఉంచాలని స్పష్టం చేసింది.