అది టీఆర్‌ఎస్ రాజకీయం కోసమే!
- జీవో 39 అప్రజాస్వామికం.. ఉపసంహరించుకునే దాకా పోరాటం: అఖిలపక్షం
- 14న గవర్నర్‌కు వినతిపత్రం.. 15న ధర్నా
- అక్టోబర్ 2న అన్ని గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు
- టీజేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ భేటీలో తీర్మానం
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ పాలనా వ్యవస్థలను, స్థానిక సంస్థలను ధ్వంసం చేసేలా టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 39 అప్రజాస్వామికమని అఖిలపక్షం మండిపడింది. దాన్ని ఉప సంహరించుకునేదాకా పోరాటం చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడతామని వెల్లడించింది. శుక్రవారం హైదరాబాద్‌లో టీజేఏసీ చైర్మన్ కోదండరాం అధ్యక్షతన అఖి లపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(కాంగ్రెస్), కె.లక్ష్మణ్ (బీజేపీ), ఎల్.రమణ(టీడీపీ), చాడ వెంకటరెడ్డి (సీపీఐ), కె.గోవర్ధన్ (న్యూడెమో క్రసీ), ప్రతాపరెడ్డి, ప్రొఫెసర్ పురుషోత్తం, భైరి రమేశ్, సారంగపాణి, వివిధ రైతు, ప్రజా సంఘాల నేతలు, ఆయా పార్టీల నేతలు, రైతు విభాగాల అధ్యక్షులు ఇందులో పాల్గొన్నారు.
రైతులను బందీ చేసే కుట్ర
గ్రామీణ వ్యవస్థలను ధ్వంసం చేయాలని, టీఆర్‌ఎస్ కార్యకర్తలతో రైతులను బందీలుగా చేయాలనే కుట్రతోనే ప్రభుత్వం జీవో 39ను తెచ్చిందని కోదండరాం మండిపడ్డారు. దానిని రద్దు చేసేదాకా పోరాడుతామన్నారు. ఈ నెల 14న గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తామని, 15న వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ఎదుట« నిరసన దీక్ష చేపడతా మని వెల్లడించారు. అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తం గా గ్రామపంచాయతీ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. ఇక అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడికి అఖిలపక్షా లు నిర్ణయించాయని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల రైతు విభాగాలు, రైతు సంఘాలతో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తామ ని.. వీటిని నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
అవి టీఆర్‌ఎస్ కమిటీలు
ప్రజల సొమ్మును టీఆర్‌ఎస్ నాయకులతో పంపిణీ చేయడానికే ప్రభుత్వం ఈ కమిటీల ను వేస్తోందని, అవి టీఆర్‌ఎస్ కమిటీలేనని పీసీసీ చీఫ్ ఉత్తమ్ మండిపడ్డారు. ఆ కమిటీలకు ప్రత్యామ్నాయంగా రైతులతో కమిటీలు వేస్తామని, అందరికీ న్యాయం జరిగేలా పోరాడుతామని చెప్పారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే టీఆర్‌ఎస్ నేతలతో రైతు సమితులు ఏర్పాటు చేస్తు న్నారని బీజేపీ రాష్ట్ర చీఫ్ కె.లక్ష్మణ్ విమర్శిం చారు. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌కు ఇచ్చే ఖర్చులాగా పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
చట్టం, నిబంధనలను పట్టించుకోకుండా జీవోలు తెస్తున్న అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. టీఆర్‌ఎస్ నేతలు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిందని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, అభివృద్ధిపై అన్ని పార్టీలు, సంఘాలతో చర్చిస్తామన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు.