హిమాయత్‌నగర్(హైదరాబాద్): ‘నేను ఎస్సైని.. నాకు నువ్వు భార్యగా వద్దు, నువ్వు వీడాకులు ఇస్తే కోటీశ్వరుల కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను’ అంటూ సంగారెడ్డి టౌన్ ఎస్సైగా పనిచేస్తున్న తన భర్త పి.లక్ష్మారెడ్డి విడాకులు ఇవ్వాలంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని భార్య జ్యోతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. రెండున్నరేళ్ల బాబును కూడా పట్టించుకోకుండా తన భర్త, అత్త, మామలు బెదిరింపులకు పాల్పడుతున్నారని కన్నీరుమున్నీరయింది. తన బిడ్డకు, తనకు న్యాయం చేయాలంటూ సోమవారం ఆమె బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెళ్లి సమయంలో రూ.15లక్షలు, 40 తులాల బంగారం పెట్టామని, కానీ, ఏడాది నుంచి తాను వెళ్లిపోతే కోట్లు ఉన్న అమ్మాయి తమకు కోడలుగా వస్తుందని అత్త, మామ అంటున్నారని పేర్కొంది. తన భర్త రోజుకో అమ్మాయితో మాట్లాడుతూ, తిరుగుతూ వాళ్లంతా తన గర్ల్‌ఫ్రెండ్స్ అని అంటూ వారిలో ఒకర్ని చేసుకుంటానని అంటున్నాడని, విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. బాలల హక్కులసంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు మాట్లాడుతూ ఈ విషయంపై మల్కాజగిరి పీఎస్‌లో ఎఫ్‌ఐఆర్ అయినా ఎస్సై లక్ష్మారెడ్డిపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. తక్షణం ఎస్సైపై చర్యలు తీసుకుని బిడ్డకు, భార్యకు న్యాయం చేయాలని కోరారు.
‘నేను ఎస్సైని.. నాకు నువ్వు భార్యగా వద్దు’
Published Mon, Jun 5 2017 7:45 PM | Last Updated on Sun, Sep 2 2018 3:46 PM
Advertisement
Advertisement