ఆంధ్రా ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడి | Andhra employees under intense pressure | Sakshi
Sakshi News home page

ఆంధ్రా ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడి

Published Mon, Sep 29 2014 2:39 AM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM

ఆంధ్రా ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడి - Sakshi

ఆంధ్రా ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడి

 గవర్నర్‌కు లేఖ రాసిన ఏపీ సీఎస్ కృష్ణారావు

 ఏపీ ఫుడ్స్ పేరు తెలంగాణ ఫుడ్స్‌గా మార్చే హక్కెక్కడుంది?
 పీసీబీని మూడు నెలల నుంచి పనిచేయనివ్వడం లేదు
 షెడ్యూల్స్‌లో లేని 38 సంస్థలనూ విభజించండి

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న సంస్థల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులను పనిచేయనివ్వటం లేదని, వెళ్లిపోవాలంటూ వారిపై తెలంగాణ ఉద్యోగ సంఘాల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు తెలియజేశారు. ఈ సంస్థల్లో ఏపీ ఉద్యోగులపై వివక్ష కనబరుస్తున్నారని, అందుకని వీటిని విభజించాలని లేకుంటే ఉమ్మడి యాజమాన్యాలను ఏర్పాటు చేయాలని గవర్నరు ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరారు. ఈ మేరకు గవర్నరుకు ఆయనొక లేఖ రాశారు. ‘‘విభజించటమో లేకుంటే ఉమ్మడి యాజమాన్యాలను ఏర్పాటు చేయటమో రెండు ప్రభుత్వాలూ కలసి చేయాలి. కానీ అలాకాక వీటిలో తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నాయి.

ఏపీ ఫుడ్స్ పేరును తెలంగాణ ఫుడ్స్‌గా అక్కడి ప్రభుత్వం ఏకపక్షంగా మార్చేసింది. షెడ్యూలు 10లోని సంస్థలు గత ఐదు దశాబ్దాల కాలంలో ఉమ్మడి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవి. రెండు రాష్ట్రాల ఉద్యోగులూ పనిచేస్తున్నారు. ఏడాదిలోగా ఈ సంస్థల విషయంలో రెండు ప్రభుత్వాలూ అవగాహనకు రావాల్సి ఉంది’’ అని సీఎస్ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘ఏ ప్రాంతంలో ఉంటే వారికే చెందుతాయనేది ధర్మం కాదు. అది అన్యాయం... అక్రమం. కొన్నింటిని విభజించటం సాధ్యం కాదు కాబట్టి ఇరు రాష్ట్రాలూ ఆ సేవల్ని సంయుక్త నిర్వహణ ద్వారా వినియోగించుకోవాలి. దురదృష్టవశాత్తూ ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఏపీఉద్యోగులపై వెళ్లిపోవాలంటూ ఒత్తిడి పెరుగుతోంది. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)లో ఆంధ్రా ఉద్యోగుల పట్ల వివక్ష చూపిస్తున్నారు.

మూడు నెలలుగా వారిని పనిచేయనివ్వడం లేదు. జవహర్‌లాల్ నెహ్రూ అర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలోనూ ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో... ఏ షెడ్యూల్‌లో లేని 38 సంస్థలను కూడా పదోషెడ్యూల్‌లోని సంస్థల్లానే ఇరు రాష్ట్రాలూ పరస్పరాంగీకారంతో విభజించుకోవాలి లేదా ఉమ్మడిగా వాడుకోవాలి. న్యాక్ డీజీని రానివ్వకుండా తెలంగాణ ఉద్యోగులు అడ్డుకుంటున్నారు. ఇలాగైతే ప్రభుత్వం పనిచేయలేదు కనక తక్షణం జోక్యం చేసుకోవాలి’’ అని ఆ లేఖలో కోరారు. లేఖ ప్రతులను తెలంగాణ సీఎస్‌కు, కేంద్ర కేబినెట్ కార్యదర్శికి, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement