ల్యాండ్ పూలింగే బెటరు
* రాజధానికి భూముల సమీకరణపై ప్రభుత్వ నిర్ణయం
* రైతుల భాగస్వామ్యం, వారికి పర్సంటేజీపై చర్చ
* మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ముఖ్యమంత్రి సూచన
* రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ ఏర్పాటు యోచన
* రాజధాని సలహా కమిటీ, అధికారులు, కలెక్టర్లతో సమీక్ష
* ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు భూముల వివరాలు సేకరించాలని ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల సమీకరణ ల్యాండ్ పూలింగ్ పద్ధతిలోనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైతే రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్‌డీఏ) ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో రైతులను ఏ మేరకు భాగస్వాముల్ని చేయాలి? ఎంత పర్సెంటేజీ ఇవ్వాలి? ప్రధానంగా వ్యవసాయ భూములే ఎక్కువగా ఉన్నందున వారి నుంచి వ్యతిరేకత రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రభుత్వం చర్చించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం క్యాంపు కార్యాలయంలో రాజధాని సలహా కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు.. క ృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యూరు. రాజధాని సలహా కమిటీ ఇటీవల పలు నగరాలను పరిశీలించిన నేపథ్యంలో వారిని ఆ వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) పద్ధతిలో భూములు సేకరిద్దామా, ల్యాండ్ పూలింగ్ (రైతులను భాగస్వాముల్ని చేస్తూ భూమి సమీకరణ) విధానంలోనా, లేదంటే సంప్రదింపుల ద్వారా (నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్) ద్వారా చేద్దామా? అన్న అంశాలపై చర్చించారు. కేంద్రం ఆమోదించిన భూసేకరణ చట్టం మేరకు నేరుగా రైతుల నుంచి భూమిని సేకరించడం కష్టతరమనే అభిప్రాయం ఈ సందర్భంగా వ్యక్తమైంది. రాష్ట్ర విభజన అనంతరం క ృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో భూముల ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్ పద్ధతే మేలని రాజధాని సలహా కమిటీ సభ్యులు సూచించారు.
విజయవాడ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని భూసేకరణ అనుసరణీయ పద్ధతి కాదని అన్నారు. యజమానులు-ప్రభుత్వం పరస్పర సహకారంతో కూడిన ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అనుసరిస్తే బావుంటుందని సీఎంకు చెప్పారు. నయా రాయ్‌పూర్‌లో అనుసరించిన ఈ విధానం రాష్ట్రానికీ ప్రయోజనకరంగా ఉంటుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. అక్కడ కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నా, ఇక్కడ వాటిని సరిదిద్దుకుని ముందుకెళితే బావుంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్ పద్ధతినే అనుసరించాలని నిర్ణయించారు.
దేనికెంత భూమి కేటారుుంచాలి?
అయితే భూముల సమీకరణ అనంతరం రాజధానిలో సాధారణ వసతులకు ఎంత శాతం భూమి వదలాలి, రోడ్లకెంత కేటారుుంచాలి, ఆస్పత్రులు, స్కూళ్లు తదితర నిర్మాణాలకు ఎంత వదలాలి, ప్రభుత్వం ఎంత భూమి తీసుకోవాలి, భూమి యజమానులకు ఎంత ఇవ్వాలి? అనే అంశాలతో మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని సభ్యులకు చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ముందుగా కొత్త రాజధానిలో పరిపాలనా భవనాల ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. దీనిపై మళ్లీ ఆదివారం సమావేశం కావాలని నిర్ణరుుంచారు. మరోవైపు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చర్చించారు. ఈ అథారిటీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని సూచించారు. దీనిపైనా మరోసారి సమావేశమవుదామని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీ సుజనా చౌదరి, శ్రీనిరాజు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్లతో సీఎం సుదీర్ఘ చర్చ
క ృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు. పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది రైతులతో భూ సమీకరణపై మాట్లాడామని, కొంతమేర భూముల వివరాలూ సేకరించామని కలెక్టర్లు చెప్పారు. సీఎం వారికి కొన్ని సూచనలిచ్చారు. కొన్ని వివరాలు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.