
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యువకులతోపాటు ఇంకా ఓటరుగా నమోదు కాని వ్యక్తులకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశాన్ని కల్పించింది. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో ఓటరు జాబితాల సవరణకు విస్తృత రీతిలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నామని ప్రకటించింది.
లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాల సవరణ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. ఓటరుగా నమోదు చేసుకునేందుకు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాపై అభ్యంతరాలు, దిద్దుబాట్ల కోసం ఇదే గడువులోగా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.
ఆన్‌లైన్‌లో ఓటరుగా నమోదు కావడానికి http:// www.nvsp.in వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 21 నుంచి వచ్చే నెల 30 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి ప్రస్తుత ఓటరు జాబితాలను పునఃపరిశీలిస్తారు. జూన్ 16 నుంచి జూలై 14 వరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పోలింగ్ కేంద్రాల భవనాల పరిశీలన జరుపుతారు.
జూలై 2 నుంచి 31 వరకు ఓటరు నమోదు కోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తారు. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఓటరు నమోదు దరఖాస్తులు, అభ్యంతరాలు, దిద్దుబాట్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ దరఖాస్తులను నవంబర్ 30 నాటికి పరిష్కరిస్తారు. వచ్చే ఏడాది జనవరి 4న ఓటరు తుది జాబితాను ప్రచురిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment