నగరానికి ‘ఐటీ’హారం!
- హైటెక్‌సిటీ తరహాలో మరో భారీ టవర్
- చిన్న ఐటీ కంపెనీల కోసం నిర్మించనున్న రాష్ట్ర ప్రభుత్వం
- మాదాపూర్ పరిసరాల్లో ఏర్పాటుకు నిర్ణయం.. రాబడుల ఆధారంగా కంపెనీల స్థాయి నిర్ధారణ
- కార్పొరేట్ ప్రాంగణాలకు మిన్నగా మౌలిక సదుపాయాల కల్పన
- మూలధనం కోసం రుణసాయం అందించేలా చర్యలు.. కొత్తగా మరిన్ని
- ఐటీ పార్కుల అభివృద్ధికి సర్కారు నిర్ణయం
- ‘ఔటర్’ చుట్టూ ఐటీ కారిడార్
- నూతన ఐటీ విధానంలో ప్రకటించనున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: నగరాన్ని దేశ ఐటీ రాజధానిగా మార్చాలని సంకల్పించుకున్న ప్రభుత్వం... చిన్న ఐటీ కంపెనీలకు ఊతమిచ్చేలా భారీ ఐటీ టవర్లను నిర్మించనుంది. హైటెక్‌సిటీలోని సైబర్ టవర్స్ తరహాలో ఈ భారీ టవర్లను నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఐటీ కంపెనీలకు అనువైన ప్రాంతంగా పేరొందిన మాదాపూర్, నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలి పరిసరాల్లోనే ఈ కొత్త టవర్లను నిర్మించాలని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారంలో ఆవిష్కరించనున్న నూతన ఐటీ విధానంలో దీనికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది.
చిన్న కంపెనీలకు పెద్దపీట: పెద్ద ఐటీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా పేరొందడంతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. కానీ ఈ రంగంలోని ఉద్యోగుల్లో 70 శాతం వరకూ చిన్న, సూక్ష్మ ఐటీ కంపెనీల్లోనే ఉన్నారు. రాష్ట్ర ఐటీ రంగంలోనూ చిన్న ఐటీ కంపెనీల పాత్ర విశేషంగా ఉందని సర్కారు గుర్తించింది. రాష్ట్రంలో దాదాపు 500కు పైగా చిన్న కంపెనీలున్నాయి. ఆ రంగం నుంచి రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయంలో వాటిదే ప్రధాన పాత్ర.
అయితే చిన్న ఐటీ కంపెనీలు తమకుండే ఆర్థిక స్తోమతతో సొంత ప్రాంగణాలను సమకూర్చుకోలేకపోతున్నాయి. చాలా వరకు అద్దె/లీజుకు తీసుకున్న భవనాల్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన ఐటీ విధానంలో చిన్న కంపెనీలకు చేయూతనిచ్చే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. అందులో భాగంగా చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీలకు లీజు/అద్దె రాయితీ ప్రకటించనుంది. ప్రత్యేకంగా చిన్న కంపెనీల ఏర్పాటు కోసమే ఐటీ టవర్లను నిర్మించాలని నిర్ణయించింది. చిన్న కంపెనీలకు ఆఫీసు స్థలం కేటాయించడంతో పాటు కంపెనీల బ్రాండ్‌కు ప్రాచుర్యం పెంపొందించేందుకు ఐటీ టవర్లు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో ఉన్న కార్పొరేట్ ఐటీ హబ్‌లను తలపించేలా వీటిలో మౌలిక సదుపాయాలను కల్పించనుంది. కంపెనీల సమావేశాలకు వీలుగా కాన్ఫరెన్స్ హాల్, వైఫై సదుపాయం, కేఫ్ ఇతర మౌలిక వసతులు ఉండేలా డిజైన్ చేయనుంది.
రూ.10 కోట్లలోపు టర్నోవర్ ఉంటే..
రూ.50 లక్షలకన్నా ఎక్కువగా-రూ.10 కోట్లలోపు టర్నోవర్ ఉన్న ఐటీ కంపెనీలు, యూనిట్లు, ఎంటర్‌ప్రైజెస్‌ను చిన్న, సూక్ష్మ ఐటీ కంపెనీలుగా పరిగణించనుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం... తయారీ రంగంలో రూ.5 కోట్లలోపు, సేవారంగంలో రూ.2 కోట్లలోపు పెట్టుబడి పెట్టే కంపెనీలను చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలుగా పరిగణిస్తారు. అయితే ఇతర రంగాలతో పోలిస్తే సాపేక్షంగా ఐటీ రంగంలో పెట్టుబడి తక్కువగా ఉంటుంది. అందువల్ల రాబడులను ఆధారంగా చేసుకుని చిన్న, సూక్ష్మతరహా కంపెనీలకు ప్రభుత్వం కొత్త నిర్వచనాన్ని పొందుపరచనుంది.
పెట్టుబడికి సాయం..
చిన్న కంపెనీల వృద్ధికి ప్రధాన అవరోధం మూలధనం. కొంతమేర ఆర్థిక సాయం అందిస్తే చిన్న కంపెనీలు సైతం క్రమేణా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పెట్టుబడి కోసం ఆర్థిక సాయం చేసే చర్యలపై కొత్త విధానంలో దృష్టి సారించనుంది. జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, రుణ సంస్థలు, ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్‌తో చిన్న ఐటీ కంపెనీలకు రుణసాయం అందించేలా సమన్వయం కుదిర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వివిధ దేశాల్లో అమల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేసి చిన్న కంపెనీలకు అండగా ఉండేలా ఈ సాయం అందించనుంది.
ఔటర్ వెంట ఐటీ కారిడార్
హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఐటీ కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, మాదాపూర్ పరిసరాల్లోనే ఐటీ పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది. ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్)లో భాగంగా ఆదిభట్ల, పోచారం ప్రాంతాల్లో ఐటీ పార్కుల ఏర్పాటు ఆరంభ దశలో ఉంది. వీటితో పాటు ఔటర్ పరిసరాల్లో ఐటీ పార్కులకు అనువైన స్థలాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. వాటిని ప్రత్యేక ఐటీ జోన్‌లుగా గుర్తించనుంది. వీటితో పాటు టీఎస్‌ఐఐసీ స్థలాల్లోనూ ఐటీ పార్కులను నెలకొల్పనుంది. ఐటీ పార్కులు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలకు పలు రాయితీలు అందించనుంది. వీటితో పాటు ఈసిటీ, మహేశ్వరం సమీపంలో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి రెండు పార్కులను నెలకొల్పనుంది.