హైదరాబాద్ నగరంలో మంగళవారం మరో ఐసిస్ సానుభూతిపరుడు అరెస్ట్ అయ్యాడు.
రేపు ఎన్‌ఐఏకు అప్పగించే అవకాశం
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మంగళవారం మరో ఐసిస్ సానుభూతిపరుడు అరెస్ట్ అయ్యాడు. గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) వేడుకలను లక్ష్యంగా చేసుకుని కుట్రలు చేస్తున్న ఐసిస్ సానుభూతిపరుల ప్రయత్నాలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో ఐసిస్ సానుభూతిపరుడుని అదుపులోకి తీసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు విచారిస్తున్నారు. అతడి పేరును అధికారులు వెల్లడించలేదు. రేపు(బుధవారం) ఎన్‌ఐఏ అధికారులకు ఐసిస్ సానుభూతిపరుడిని అప్పగించే అవకాశం ఉంది. అయితే తమకు ఎలాంటి సమాచారం లేదని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.
ఇప్పటికే హైదరాబాద్లో గత శుక్రవారం నలుగురు ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ అధికారులు తమ అధీనంలోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 14 మంది ఐసిస్ సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే వేడుకలను లక్ష్యంగా చేసుకొని కుట్రలు చేస్తున్న వీరి ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు.