► దాడులకు కుట్ర
► నిఘావర్గాలకు సమాచారం
► అప్రమత్తం
సాక్షి, చెన్నై : తమిళనాడును గురి పెట్టి దాడులకు ఐఎస్‌ఐఎస్ వ్యూహ రచన చేసినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. జాతీయ నేర పరిశోధన సంస్థ(ఎన్ఐఏ) వర్గాలకు చిక్కిన తీవ్రవాది ఇచ్చిన సమాచారంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలోని చెన్నై, మదురై నగరాలు తీవ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్నట్టు గతంలో కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి వచ్చే సమాచారాలు, హెచ్చరికలతో అప్రమత్తంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. అప్పుడప్పుడు రాష్ట్రంలో నక్కి ఉన్నతీవ్ర వాదుల్ని ఎన్ ఐఏ గుర్తించి పట్టుకెళ్తుండడం, ఇక్కడి భద్రతను ప్రశ్నార్థకం చేసింది. తాజాగా, రాష్ట్రంలో ఐఎస్‌ఐఎస్ తీవ్ర వాదులు తిష్ట వేసి ఉండడం ఇటీవల వెలుగులోకి వచ్చింది.
జాతీయ నేర పరిశోధనా సంస్థ (ఎన్ ఐఏ)కు కేరళలో చిక్కిన ఐఎస్‌ఐఎస్ మద్దతుదారుల వద్ద జరిపిన విచారణతో తిరునల్వేలి జిల్లా కడయనల్లూరులో ఒకర్ని, చెన్నైలో ఒకర్ని, కోయంబత్తూరులో మరొకర్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి వలలో పడి, ఐఎస్‌ఐఎస్‌కు మద్దతుగా వ్యవహరించే వాళ్లు మరెవ్వరైనా రాష్ట్రంలో తిష్ట వేసి ఉన్నారా అన్న ఆందోళన బయలు దేరడంతో, ఆ దిశగా విచారణ సాగుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో పట్టుబడ్డ ఐఎస్‌ఐఎస్ తీవ్రవాది వద్ద ఎన్ ఐఏ వర్గాలు జరిపిన విచారణలో కేరళ, తమిళనాడును గురిపెట్టి దాడులకు వ్యూహ రచన జరిగిన ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రంలో ఐఎస్‌ఐఎస్ కదలికలు ఇటీవల కాలంగా పెరగడం, తాజాగా కేంద్రం హెచ్చరికలతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ ఉత్కంఠ నెలకొని ఉండడంతో, ఇదే అదనుగా చాపకింద నీరులా ఐఎస్‌ఐఎస్ తీవ్ర వాదులు ఏదేని వ్యూహాలు రచించారా అన్న ఉత్కంఠ తప్పడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, జన సంచారం అత్యధికంగాఉండే ప్రాంతాల్లో భద్రతను ఐదంచెలకు పెంచారు.