
టెన్.. డౌన్.. టీడీపీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై
► టీఆర్‌ఎస్‌లోకి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
► సీఎం ఢిల్లీ నుంచి రాగానే చేరతానని వెల్లడి
► ముందు బాబు సమక్షంలో టీడీపీ భేటీలో ప్రసంగం
► ఆ వెంటనే హరీశ్, లక్ష్మారెడ్డిలతో భేటీ, చేరిక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఎదురుదెబ్బల పరంపరకు, ఆ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యేల వలసకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కన్పించడం లేదు. టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావుతో పాటు ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకోగా, తాజాగా గురువారం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి కూడా పార్టీకి గుడ్‌బై చెప్పారు. గురువారం రాత్రి నగరంలోని ఓ స్టార్ హోటల్‌లో మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డిలతో ఆయన సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ తాను టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు.
‘‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాలని నిర్ణయించుకున్నా. ఎమ్మెల్యేగా గెలిచి 20 నెలలైనా ప్రజల కోసం ఏమీ చేయలేకపోయాం. అందుకే వారికోసం పార్టీ మారాలని నిర్ణయించుకున్నా. సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే ఆయనతో సమావేశమై, నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించి, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరతా. కార్యకర్తల కోరిక మేరకు తీసుకున్న ఈ నిర్ణయం నా వ్యక్తిగతం’’ అని పేర్కొన్నారు. దీంతో టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్ బాట పట్టిన ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది.
ఉదయం టీడీపీ భేటీలో పాల్గొని...
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి కారణాలపై చంద్రబాబు సమక్షంలో గురువారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం, తద్వారా కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యంపై మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలంటూ పిలుపునిచ్చారు! కార్యకర్తలకు అండగా నిలిచే నాయకుడి అవసరముందని కూడా వ్యాఖ్యానించారు. తీరా ఆ సమావేశం ముగియగానే మంత్రులతో సమావేశమై, టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించేశారు!!