కొత్త మేయర్ పై ఉత్కంఠ!
♦ అధికార టీఆర్‌ఎస్‌లో జోరుగా చర్చలు
♦ ప్రచారంలో బొంతు రామ్మోహన్, విజయలక్ష్మి పేర్లు
♦ మరో ఇద్దరు బీసీ నేతలూ రేసులో ఉన్నారంటున్న పార్టీవర్గాలు
♦ అధినేత మదిలో ఎవరున్నారో తెలియని పరిస్థితి
♦ 11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక.. అదే రోజున తొలి సమావేశం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం మేయర్ పదవిపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ ఎన్నికల్లో 150 డివిజన్లకుగాను టీఆర్‌ఎస్ 99 డివిజన్లను సొంతం చేసుకుని సింగిల్ మెజారిటీ పార్టీగా అవతరించింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎవరిని వరిస్తాయనేది ఉత్కంఠగా మారింది. ఈసారి మేయర్ పీఠం బీసీ జనరల్‌కు రిజర్వు అయింది. పరోక్ష పద్ధతిలో కార్పొరేటర్లే మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకుంటారు. అసలు మేయర్ ఎన్నికకు సంబంధించి ఇప్పటిదాకా తమ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని టీఆర్‌ఎస్ బయటపెట్టలేదు.
ఎందుకంటే సరిపడ మెజారిటీ రాకుంటే ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితిని టీఆర్‌ఎస్ ఎదుర్కుని ఉండేది. కాబట్టే ముందుగా మేయర్ అభ్యర్థి విషయాన్ని పక్కన పెట్టిందనే అభిప్రాయముంది. కానీ ఎక్స్‌అఫీషియో ఓట్లు కూడా అవసరం లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకునే స్థాయిలో టీఆర్‌ఎస్ మెజారిటీ సాధించింది. దీంతో కార్పొరేటర్లుగా గెలిచిన పలువురు నేతల్లో ఆశలు పెరిగిపోయాయి. ఎన్నికల ప్రచారం సమయంలోనే టీఆర్‌ఎస్ మేయర్ అభ్యర్థులుగా పార్టీ యువజన విభాగం నేత బొంతు రామ్మోహన్, పార్టీ సెక్రెటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు (కేకే) కుమార్తె విజయలక్ష్మిల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
వలస సంఖ్యే ఎక్కువ: ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఒకింత వింత పరిస్థితిని ఎదుర్కొంది. హైదరాబాద్‌లో పెద్దగా పట్టులేకపోవడం, క్షేత్రస్థాయిలో సరైన నాయకత్వం లేకపోవడంతో తొలుత డివిజన్లలో పోటీ పడగలిగిన అభ్యర్థుల కొరత వెంటాడింది. అయితే టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్ ’తో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు గులాబీ గూటికి చేరారు. దాంతో ఆయా డివిజన్లలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముందు నుంచీ పార్టీలో కొనసాగిన నేతలు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేటర్లుగా అందివచ్చిన అవకాశం కంటే... వివిధ పార్టీల నుంచి వలస వచ్చి టికెట్లు దక్కించుకుని విజయం సాధించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.
గత జీహెచ్‌ఎంసీ పాలకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఫ్లోర్‌లీడర్లుగా వ్యవహరించిన వారు సైతం ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున బరిలోకి దిగి గెలిచారు. కానీ వారెవరూ ఇప్పటికిప్పుడు మేయర్ పీఠాన్ని ఆశించే పరిస్థితి లేదు. దీంతో ఒకవిధంగా టీఆర్‌ఎస్‌లో మేయర్ పదవి కోసం పెద్దగా పోటీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు అధినేత కేసీఆర్ మనసులో ఏముందో తెలుసుకోలేకపోతున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా బొంతు రామ్మోహన్, గద్వాల విజయలక్ష్మిల పేర్లు ప్రచారంలో ఉన్నాయని, మరో ఇద్దరు బీసీ నేతలూ ఆశిస్తున్నారని అంటున్నారు.
టీఆర్‌ఎస్ కొత్త కార్పొరేటర్లంతా శనివారం సీఎం కేసీఆర్‌ను కలసినప్పుడూ మేయర్ అభ్యర్థిత్వం అంశం చర్చకు రాలేదని సమాచారం. ఎన్నిక జరగాల్సిన 11వ తేదీ దాకా మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల విషయంలో ఇదే గోప్యత కొనసాగవచ్చని చెబుతున్నారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో జీహెచ్‌ఎంసీ తొలి సర్వసభ్య సమావేశం కూడా 11వ తేదీనే జరగనుంది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి.గోపాల్ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.