8 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
Published Wed, Aug 24 2016 7:28 PM | Last Updated on Wed, Oct 17 2018 5:47 PM
- నాలుగైదు రోజులపాటు నిర్వహించే అవకాశం
- జీఎస్‌టీ ఫోకస్ పాయింట్ గా సమావేశాలు
- సభలో చర్చించే సమస్యలు పెద్దగా లేవు
- ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి యనమల
అమలాపురం
రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 8న ప్రారంభమై, నాలుగైదు రోజులపాటు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఆర్థిక, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బుధవారం ఆయన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ తొలుత అసెంబ్లీ సమావేశాలను అమరావతిలో నిర్వహించాలనుకున్నామని, కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ బిల్లును వచ్చే నెల 8 తేదీ నాటికి ఆమోదించి పంపాల్సిందిగా కోరడంతో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామన్నారు. జీఎస్‌టీ బిల్లును మన శాసన మండలి, శాసనసభలు ర్యాటిఫై చేయాల్సి ఉందన్నారు. ‘రాజ్యాంగం ప్రకారం సగం రాష్ట్రాలు జీఎస్‌టీని మండలి, శాసనసభల్లో ఆమోదించాల్సి ఉందని, 2017 ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేయాలని నిర్ణయించిన కేంద్రం రోడ్డు మ్యాప్ తయారు చేసింది’ అని యనమల చెప్పారు. దీనిలో భాగంగా వచ్చేనెల 8వ తేదీలోపు జీఎస్‌టీని ర్యాటీఫై చేయాలని సూచించిందన్నారు. జేఎస్‌టీ ఆమోదానికి ప్రతిపక్షం కూడా సహకరించాల్సిన అవసరముందన్నారు. ఎన్ని రోజులు సభ నిర్వహించాలి, ఏఏ సబ్జెక్టులు చర్చించాలనేది తొలి రోజున బీఏసీ సమావేశం నిర్వహించి ప్రకటిస్తామన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి చైర్మన్‌గా ఉన్న హైపర్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు ఈ నెల 30న న్యూఢిల్లీలో సమావేశమై జీఎస్‌టీ పరిహారం కేటాయింపులపై చర్చిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.935 కోట్లు బకాయి రావాల్సి ఉందన్నారు.
Advertisement
Advertisement