మహాధర్నాలో ఉద్యోగ నేతల ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ రంగాన్ని నాశనం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని టీఆర్‌ఎస్ నేత దేవీప్రసాద్ ఆరోపించారు. ఏపీ విద్యుత్ ఉద్యోగులు తెలంగాణ విద్యుత్ సంస్థల్లో కొనసాగడాన్ని ఎట్టి పరిస్థితిలో అనుమతించబోమన్నారు. విద్యుత్ ఉద్యోగుల విభజన కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఏపీ వైఖరికి నిరసనగా తెలంగాణ విద్యుత్ సంఘాల ఐక్య సమితి ఆధ్వర్యంలో సోమవారం విద్యుత్‌సౌధలో మహాధర్నా జరిగింది.
ఈ సందర్భంగా దేవీ ప్రసాద్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌లు మాట్లాడుతూ.. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలు రాకుండా కుట్ర పన్నిన ఏపీ పాలకులు.. విద్యుత్ ఉద్యోగుల విషయంలోనూ కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు స్వచ్ఛందంగా తమ రాష్ట్రానికి వెళ్తామన్నా ఏపీ ప్రభుత్వం ఒప్పుకోకపోవడం తీవ్ర అన్యాయమన్నారు. విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంతవరకైనా పోరాడుతామని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు శివాజీ పేర్కొన్నారు.
తెలంగాణ విద్యుత్ రంగంపై ఏపీ కుట్రలు
Published Tue, May 3 2016 3:31 AM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM
Advertisement