సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థలో 81.54 శాతం వాటా ఉన్న ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (అప్మెల్)ను స్వాధీనం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గట్టిగా తిప్పికొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి సోమవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గాబాకు లేఖ రాశారు. అప్మెల్ ఎండీ చేసిన సిఫారసులకు విరుద్ధంగా, నిపుణుల కమిటీ సభ్యుడు లేవనెత్తిన అంశాలకు భిన్నంగా, విభజన చట్టాన్ని తప్పుగా అన్వయిస్తూ షీలాభిడే నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చిందని అందులో ప్రస్తావించింది.
అప్మెల్ సింగరేణికి అనుబంధ సంస్థ. తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం, భారత ప్రభుత్వానికి 49 శాతం వాటాలున్న సింగరేణికి అప్మెల్‌లో 81.54 శాతం వాటా ఉంది. ఏపీఐడీసీకి 5.79 శాతం, ఉమ్మడి ఏపీకి 0.86 శాతం, పబ్లిక్ షేర్ హోల్డర్స్‌కు 11.81 శాతం వాటాలున్నాయి. ఏ ప్రాంతంలో ఉన్న సంస్థలు, ఆ రాష్ట్రానికే చెందుతాయని విభజన చట్టంలో పేర్కొన్న అంశాన్ని ఆసరాగా చేసుకుని ఏపీ ప్రభుత్వం అప్మెల్ తమకే కావాలని పట్టుపట్టింది. ముందునుంచీ తెలంగాణ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది. అది సింగరేణికి చెందిందని, ఏపీ ప్రభుత్వ పరిధిలోకి తాము రామని అప్మెల్ ఎండీ కూడా నిపుణుల కమిటీకి చెప్పారు.
నిపుణుల కమిటీలో సభ్యుడైన ఏకే గోయల్ కూడా అప్మెల్ సింగరేణికే చెందుతుందని స్పష్టం చేశారు. ఇవేవీ పట్టించుకోకుండా షీలా భిడే కమిటీ అప్మెల్‌ను ఏపీకి కేటాయించాలని ప్రతిపాదించారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 0.5 శాతం వాటా ఉన్న ఏపీ అప్మెల్ మొత్తం తమదేనని వాదించడం అసమంజసమని ఫిర్యాదులో పేర్కొంది. అప్మెల్‌కు విజయవాడ, విజయవాడ సమీపంలోని కొండపల్లిలో విలువైన ఆస్తులున్నాయని, వాటికోసమే ఏపీ అప్మెల్‌ను హస్తగతం చేసుకోవాలని చూస్తోందని ఆరోపించింది.
62శాతం ఫిట్‌మెంట్ ఇవ్వండి: ఎన్‌ఎంయూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ కానుకగా ఆర్టీసీ కార్మికులకు 62శాతం ఫిట్‌మెంటుతో వేతన సవరణ చేయాలని సీఎం కేసీఆర్‌కు ఆర్టీసీ ఎన్‌ఎంయూ విజ్ఞప్తి చేసింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రక్షించడానికి సీఎం ప్రత్యేక చొరవ చూపాలని కోరింది. ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణతో తగిన ఆర్థిక సహాయం చేసి కార్మికులను ఆదుకోవాలని ఎన్‌ఎంయూ నేతలు ఎం.నాగేశ్వర్ రావు, కె.రఘురాం, పి.కమల్‌రెడ్డి, ఎండీ మౌలానా, ఎం.నరేందర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment